జగనన్న ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగనన్న కాలనీలలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే, విజయనగరం జిల్లాలోని జగనన్న కాలనీలో పవన్ పర్యటించి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు గ్రామంలో జనసేన, వైసిపి కార్యకర్తళ మధ్య గొడవ జరిగింది.
‘‘జగనన్న ఇళ్లు-ప్రజలకు కన్నీళ్లు’’ కార్యక్రమంలో భాగంగా తొర్రేడు సచివాలయం వద్దకు జనసేన నాయకులు చేరుకున్నారు. జగనన్న కాలనీలకు సంబంధించిన వివరాలు అడిగేందుకు వారు ప్రయత్నించారు. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న వైసీపీ శ్రేణులు…జనసేన నాయకులను, కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. జనసేన శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దుర్భాషలాడుతూ ఘర్షణకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగి పరిస్థితి అదుపు తప్పింది. ఆ తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో జగనన్న ఇళ్ల నిర్మాణ పనులపై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పందించారు. పేదలకు ఇళ్లు అంటూ వైసీపీ నాయకులు ఊదర గొట్టారని, కానీ, ఈ మూడున్నర సంవత్సరాలలో పూర్తి చేసిన ఇళ్లు 60 వేలు కూడా దాటలేదని కాల్వ విమర్శలు గుప్పించారు.
మిగిలిన కాలంలో ఎన్నికలు వంటి వ్యవహారాల నేపథ్యంలో మిగతా జిల్లా నిర్మాణాలపై శ్రద్ధ వహించే పరిస్థితి లేదని అన్నారు. జగనన్న కాలనీలు జనావాసాలకు అనుగుణంగా నిర్మాణం పూర్తి చేసుకోవడం అసాధ్యమని కాల్వ అభిప్రాయపడ్డారు. జనావాసాలకు 5 నుంచి 30 కిలోమీటర్ల దూరంగా ఇంటి స్థలాలు ఉన్నాయని, అక్కడ జీవించలేమని చెప్పారు. అక్కడ నీటి సదుపాయం, రోడ్డు సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు కూడా లేవని అన్నారు. జగనన్న చెప్పిన ఇల్లు పూర్తి చేయాలంటే కనీసం ఐదు లక్షలు కావాలని అన్నారు.