ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఇటీవల కాలంలో ఆపన్న హస్తం అందిస్తున్న సోనూసూద్ .. త్వరలోనే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. చంద్రబాబు విజన్ బాగుందని.. తనకు ఎప్పటి నుంచో చంద్రబాబు గురించి తెలుసునని.. ఆయనతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమని సోనూ తాజాగా వెల్లడించడం రాజకీయ వర్గాలు సహా .. సాధారణ ప్రజల్లోనూ ఆసక్తిగా మారింది.
బాబు చొరవతో..
దేశానికి కరోనా విసురుతున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అన్న అంశంపై.. వివిధ రంగాల నిపుణులు, ప్రముఖులతో తాజాగా చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సమావేశంలో నటుడు సోనూసూద్‌తో పాటు వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు. కొవిడ్ సమయంలో తనకు తోచిన సాయం అందిస్తున్నట్లు ఈ సందర్భంగా సోనూసూద్ వెల్లడించారు. ఈ మేరకు విపత్కర పరిస్థితుల్లో సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ మహమ్మారి చాలా మందిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బాబు గ్రేట్!
హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశానని సోనూ కొనియాడారు. కొవిడ్‌పై పోరాటంలో ఇద్దరి ఆలోచనలు కలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సేవకు ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని సోనూసూద్‌కు చంద్రబాబు సూచన చేశారు. త్వరలోనే ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని కోరిన నేపథ్యంలో చంద్రబాబు సూచనను సోనుసూద్ అంగీకరించారు. కలిసి పనిచేసేందుకు కూడా ఆయన ముందుకు వస్తున్నట్టు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలపై..
ఆంధ్రా, తెలంగాణ.. తనకు రెండో ఇల్లు వంటివని సోనూ తెలిపారు. తన భార్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కావడం ఆనందకరమని అన్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలోనూ సాయం కోసం ఫోన్ కాల్స్ వచ్చేవని తెలిపిన సోనూసూద్ .. సమయంతో సంబంధం లేకుండా సేవ చేయడమే విధిగా భావించినట్లు స్పష్టం చేశారు.
సేవ చేయండి
ఎవరికివారు తమ సాయాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దని.. సాయం కోరిన వారి పట్ల సేవ చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోండని ప్రజలకు, అభిమానులకు సోనూ సూద్ సూచించారు. కుల, మత ప్రాంతాలతో పని లేదన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో 18 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తొలిదశలో కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్‌తో పాటు 4 చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.