ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన కుప్పంలో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం కుప్పానికి చేరుకున్న చంద్రబాబు.. ఇక్కడ టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం బిడ్డగానే పుడతానంటూ ఆయన వ్యాఖ్యానించారు. “9వ సారి ఎమ్మెల్యే గా గెలిచాను.. ఇందులో 8 సార్లు కుప్పం నుంచే ఎమ్మెల్యే గా గెలిపించారు. మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా“ అని చంద్రబాబు అన్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో 164 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని, కుప్పం ప్రజలకు రుణపడి వున్నానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ను తిరగ రాయబోతున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో యువత, మహిళలు, బలహీనవర్గాలకు అవకాశం ఇచ్చామని తెలిపారు. కేబినెట్ లో 8మంది బీసీలకు అవకాశం ఇచ్చామన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేముందు కుప్పం ప్రజల ఆశీస్సుల కోసమే నియోజకవర్గానికి వచ్చినట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీసుకుంటానని చంద్రబాబు అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
కుప్పం నియోజకవర్గాన్ని 1994 – 2004 వరకు, 2014 – 2019 వరకు ఎంతో అభివృద్ధి చేశానన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు లింకు రోడ్లు వేస్తామని చెప్పారు. పరిశుభ్రమైన నగరంగా కుప్పం ను తీర్చిదిద్దుతానన్నారు. కుప్పం మునిసిపాలిటీ ని అభివృద్ధి చేసి..కుప్పంను మోడల్ మున్సిపాలిటీగా తయారుచేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మళ్లీ మినరల్ వాటర్ ఇస్తామని, ఈ సంవత్సరం… కృష్ణా జలాలు తీసుకొని వస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో కుప్పం లో కరువు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని చెరువులకు నీరు నింపుతానన్నారు. సాగునీరు ఇస్తే బంగారం పండించే రైతాంగం కుప్పంలో ఉందని చెప్పారు.
కుప్పం నుంచి ఎయిర్ కార్గో ద్వారా ఇక్కడి రైతులు పండించిన పంటలను విదేశాలకు పంపించేఏర్పాట్లు చేస్తామని చంద్రబాబు చెప్పారు పేదరిక నిర్మూలనలో కుప్పం దేశానికి ఆదర్శం గా కావాలన్నారు. కుప్పం అభివృద్ధి కి డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. నియోజకవర్గంలోని అన్ని మారుమూల గ్రామాలకు నెట్ వర్క్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కుప్పంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయించనున్నట్టు చంద్రబాబు చెప్పారు. కాగా, చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పార్టీ అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.