సినిమా అంటే.. హీరో ఉంటాడు. హీరోయిన్ ఉంటుంది. విలన్ ఉంటాడు. పాటలు ఉంటాయి. ఫైటింగ్ లు ఉంటాయి. భారీ డైలాగులు ఉంటాయి. రసవత్తరసన్నివేశాలు ఉంటాయి. హుషారు ఎక్కించే క్లబ్ డ్యాన్సులు.. ఐటెం సాంగులు ఉంటాయి. కానీ.. కళాతపస్వి కె. విశ్వనాథ్ సినిమాల్లో మాత్రం అవేమీ ఉండవు. అవేమీ లేకుండా సినిమా ఎందుకు అవుతుందన్న సందేహం కలుగుతుంది. అందుకే ఆయన కళాతపస్వి అయ్యారు. ఆయన తీసిని సినిమాలు ఆణిముత్యాలు అయ్యాయి. జీవితాన్ని ఆవిష్కరిస్తూ.. విలువల గురించి రేఖా మాత్రంగా చెప్పే ఆయన సినిమా చూసిన తర్వాత మనసు తేలికపడుతుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చినట్లు ఉంటుంది.
ఆయన సినిమాలు నీతిని చెబుతుంటాయి. మనిషిలోని మానవత్వాన్ని నిద్ర లేపుతాయి. ఆయన తీసిన ఒక్కోచిత్రం ఒక్కో విలువల పాఠంగా చెప్పాలి. ఆత్మాభిమానం విలువను వివరిస్తూ.. వరకట్న దురాచారంపై ఆయన శుభలేఖతో వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తే.. కులం కాదు గుణమే ముఖ్యమని ఆచారాలను దాటి వేసిన సప్తపది అడుగులు.. గంగిరెద్దులు ఆడించే ఇంట పుట్టి.. కలెక్టర్ గా మారి ఊరిపెద్ద అవినీతి ఆటను తెలివిగా కట్టడి చేసే సూత్రధారులు.. కష్టపడే తత్త్వం.. చక్కటి గుణం ముందు మరే సిరి సంపదలూ సాటి రావని చెప్పే స్వయంక్రషి.. మనోనేత్రంతో స్వచ్చమైన ప్రేమను గుర్తించిన అంధుడి వేణగానంతో కురిపించిన సిరివెన్నెల.. అహం చీకట్ల నుంచి గురువును బయటకు తెచ్చే శిష్యుడి ప్రాణ త్యాగం స్వాతికిరణం.. తండ్రి ఆకాంక్షలు.. తన ఆశల మధ్య నలుగుతూ చివరకు నాట్య మయూరిగా వికసించే స్వర్ణ కమలం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాలు చెప్పే విలువల పాఠాలు ఎన్నో ఉంటాయి.
తెలుగు సినిమా మూసధోరణిలో కొట్టుకుపోతున్న వేళలో.. వాటికి సరికొత్త షాకిచ్చిన దర్శకుడిగా కె.విశ్వనాథ్ ను చెప్పాలి. తెలుగు సినిమా అంటే హీరోయిజం.. హీరో ఆర్భాటాలతో హడావుడి చేస్తున్న వేళ.. కళతో ఆడించి.. లాలించి.. పాలించిన తెలుగు సినిమా కీర్తిని నిలబెట్టిన దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయన సినిమాలో కథ మాత్రమే కాదు. కళ ఉంటుంది. విలువలు ఉంటాయి. అలా అని నీతి తప్పినోళ్లు ఉండరని కాదు. అలాంటి వారు ఉన్నప్పటికీ.. జీవితం కళ్ల ముందు కనిపిస్తూ ఉంటుంది. ఆయన సినిమాల్లో హీరో ధీరుడు కాడు. కళాకారుడు మాత్రమే. ఆయన హీరోకు కండలు ఉండవు. కళ మాత్రమే ఆభరణంగా సాగుతుంది. ఆయన హీరో ఫైట్లు చేయడు. కానీ.. తప్పుల్ని సరిదిద్దుతాడు. చెడును జయిస్తాడు.
ఆయన సినిమాల్లో రొమాన్సు ఉంటుంది. కానీ.. అది శరీరాన్ని వేడెక్కించదు. మనసును గిలిగింతలు పెట్టేలా సున్నితంగా ఉంటుంది. అప్పటివరకు ప్రపంచానికి తెలియని అరవై ఏళ్ల వయస్కుడ్ని తీసుకొచ్చి ఏకాఏకిన హీరోను చేసి.. ఆయన ఇంటి పేరును సైతం తన సినిమా పేరుగా మార్చిన దర్శకుడిగా ఆయన మాత్రమే నిలుస్తారు. డాన్సులు.. ఫైట్లతో యువతను ఊర్రూతలూగించే మాస్ హీరో చిరంజీవిని సైతం చెప్పులు కుట్టేవాడిగా చూపించి.. మెప్పించిన సాహసికుడు ఆయన . ఆయన సినిమాకు వెళ్లటం అంటే.. గుడికి వెళ్లి పవిత్రంగా దేవుడికి దండం పెట్టుకోవటమే. అగరొత్తుల ఘమఘుమల నడుమ పురాణాల్ని వినటమే. ఎంతో మంది హీరోల్ని గొప్ప నటులుగా మలచిన శిల్పకారుడు కె. విశ్వనాథ్. ఆయన సినిమాల్లో కథ కాదు జీవితం ఉంటుంది. అందుకే ఆయన కళాతపస్వి అయ్యారు.