కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చిదంబరాన్ని ఓ ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించిన సాయిరెడ్డి, చిదంబరాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు చిదంబరానికి నైతికతే లేదని, చిదంబరం వ్యవహారాలను లా కాలేజీలు కేస్ స్టడీలుగా తీసుకోవాలంటూ షాకింగ్ కామెంట్లు చేయడం దుమారం రేపింది.
మనీ ల్యాండరింగ్ ద్వారా చైనా పౌరుల నుంచి లంచాలు తీసుకుని వీసాలు ఇప్పించారంటూ చిదంబరంపై సాయిరెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు. కేబినెట్ మంత్రి హోదాలో చిదంబరం ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని అన్ని నేరాలకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. తాను చేసిన అన్ని తప్పులకు చిదంబరం ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వచ్చిందని సాయిరెడ్డి అన్నారు. తక్షణమే చిదంబరాన్ని అరెస్ట్ చేయాలంటూ #arrestchidambaram ను పోస్ట్ చేశారు.
ఇక, 2004- 14 మధ్యలో కేంద్ర మంత్రి హోదాలో చిదంబరం తీసుకున్న అన్ని నిర్ణయాలు, వ్యవహారాలపై విచారణ చేపట్టాలని సాయిరెడ్డి డిమాండ్ చేశారు. తన ప్రత్యర్థులపై నిర్దయగా తప్పుడు కేసులు పెట్టించిన చిదంబరం, ఇపుడు పరిస్థితి అంతా తారుమారయ్యేసరికి నీతి వచనాలు వల్లిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిదంబరం విత్తిన పాపం ఇప్పుడు ఫలాలు ఇస్తోందని, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ చిదంబరం కోట్లరూపాయల ధనాన్ని సంపాదించారని ఆరోపించారు.
చిదంబరం జాతి వ్యతిరేకి అని, అటువంటి ఆర్థిక నేరగాడు ఆర్థిక, రాజకీయ అంశాలపై ధైర్యంగా ఉపన్యాసాలివ్వడం ఏమిటో తనకు అర్థం కాలేదని అన్నారు. పట్టపగలే దోపిడీలకు పాల్పడ్డారంటూ చిదంబరంపై విమర్శలు గుప్పించారు. చిదంబరం అక్రమాల వలన సర్కారీ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని, ధనికుల కోసం పేదలను దరిద్రంలో కూరుకుపోయేలా చిదంబరం వ్యవహరించారని ఆరోపించారు. దేశంలో యూపీఏ హయాంలో స్కాంలకు పాల్పడ్డ అందరితోనూ చిదంబరం ఒప్పందాలు కుదుర్చున్నారని సాయిరెడ్డి విమర్శించారు.
అయితే, హఠాత్తుగా చిదంబరాన్ని సాయిరెడ్డి ఎందుకు టార్గెట్ చేశారన్న విషయంపై చర్చ జరుగుతోంది. మరోసారి రాజ్యసభకు నామినేట్ అయిన ఊపులో విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ను కేసులలో ఇరికించడంలో చిదంబరం పాత్ర కూడా ఉందని, అందుకే ఇపుడు చిదంబరం, ఆయన తనయుడు కార్తీపై ఆర్థికపరమైన కేసులు నమోదువుతున్న తరుణంలో సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చి జగన్ పై స్వామిభక్తి చాటుకుంటున్నారని అంటున్నారు. ఇక, కాంగ్రెస్ తో వైసీపీ పొత్తు లేదని స్పష్టమైన సంకేతాలిచ్చేందుకే ఇలా విమర్శలు గుప్పించారని మరో టాక్. ఇక, ఈ ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో చిదంబరానికి, సాయిరెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలోనే ఆయనను సాయిరెడ్డి టార్గెట్ చేశారని తెలుస్తోంది.