ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎపిసోడ్ కు సుప్రీం కోర్టు తీర్పుతో దాదాపుగా తెరపడిన సంగతి తెలిసిందే. బుధవారం విచారణకు రానున్న ఓటర్ల జాబితా పిటిషన్ పై కొందరు వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నప్పటికీ… మెజారిటీ వైసీపీ నేతలు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైపోయారు… తప్పదు కదా.
తాము ఎన్నికలకు సిద్ధమంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ముఖ్యనేతలతో సమావేశమైన జగన్ భారంగా బాధ్యతను ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. అధికార పక్షంగా తాము పంచాయతీ ఎన్నికలకు సిద్ధమేనని సజ్జల అధికారికంగా ప్రకటించారు.
ఓ రాజకీయ పార్టీగా ఈ స్థానిక ఎన్నికలను వైసీపీ ఆహ్వానిస్తోందని సజ్జల వెల్లడించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వద్దన్నామని, కానీ, సుప్రీంకోర్టు తీర్పును అంగీకరిస్తున్నామని చెప్పారు. (అయినా అంగీకరించకపోతే ఏం జరుగుతుందో బాగా తెలుసు కాబట్టి తప్పదు).
తాము ఎన్నికలకు వ్యతిరేకం కాదన్న సజ్జల….వ్యాక్సిన్ తీసుకోకుండానే ఉద్యోగులు ఎన్నికలకు వెళ్లాల్సి రావడం బాధాకరమన్నారు. (వ్యాక్సిన్ ఇవ్వకుండానే పిల్లలను స్కూళ్లకు పంపిన గవర్నమెంటు ఉద్యోగులను మాత్రం వ్యాక్సిన్ ఇవ్వకుండా ఒక్క రోజు ఎన్నికల బాధ్యత నిర్వహించడానికి ఫీలవుతోంది పాపం).
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఏదైనా జరిగితే ఎస్ఈసీదే బాధ్యతని సజ్జల హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల ఆవేదనను ఎస్ఈసీ అర్థం చేసుకోవడం లేదని సజ్జల వాపోయారు. కానీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మధ్యలోనే వదిలేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వెనుక కుట్ర ఉందని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్, ఎలక్షన్ ఒకేసారి జరపడం కష్టమేనన్నారు. (అయ్యో మిమ్మల్ని అడగకుండా రెండు ఒకేసారి నిర్వహించగలం అని సీఎస్ కేంద్రానికి లేఖ రాశారే).
గతంలో మాదిరే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని, ఇటు ప్రభుత్వం, అటు సీఎస్, తదితర ఉన్నతాధికారులతో చర్చించకుండానే…హుటాహుటిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావాలంటూ కేంద్రానికి నిమ్మగడ్డ లేఖ రాశారని సజ్జల తప్పుబట్టారు. (అయినా ఉద్యోగ సంఘాలు మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పాకనే ఆయన లేఖ రాశారు. ఈ విషయం మరిచిపోయి అబద్ధాలు ప్రచారం చేస్తే ఎలా?)
చట్టాలు, న్యాయ వ్యవస్థలకు లోబడి వైసీపీ సర్కార్ పనిచేస్తుందని, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తప్పకుండా పాటిస్తామన్నారు. ఇది ఒక రోజు ముందు చెప్పి ఉంటే బాగుండేదిగా. ఓ వ్యక్తి అధికారాలను జన్మహక్కులుగా భావించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని సజ్జల విమర్శించారు. (చివరకు మీరు జగన్ ఏమనుకుంటున్నారో బయటకు చెప్పేశారే).
ఎస్ఈసీ వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని, ఆయన ఇవాళ ఉండి రేపు వెళ్లిపోతారని, కానీ వ్యవస్థలు శాశ్వతం అని సజ్జల అభిప్రాయపడ్డారు. (ముఖ్యమంత్రి పోస్టుకు కూడా ఇదే వర్తిస్తుంది సజ్జల గారు. ఆ విషయం మీరు మరిచిపోతే ఎలా?)