ఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న దోబూచులు రోజుకోరకంగా మారుతున్నాయి. ఏపీ రాజధానిగా 2016లో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని ఎంపికచేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రానికి నడిబొడ్డున ఉండడంతోపాటు.. పవిత్ర కృష్ణానది తీరంలో ఉంటుందని.. అందరికీ సౌలభ్యం గా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్టుచంద్రబాబు ప్రకటించారు. దీనికి అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ కూడా జైకొట్టారు. దీంతో కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టారు.
15 వేల కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేశారు. దీనిలో 4 వేల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వమూ ఇచ్చింది. హైకోర్టు ను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తూ.. రాష్ట్రపతి సైతం గెజిట్ విడుదల చేశారు. రాజధాని నగరానికి సాక్షాత్తూ.. పీఎం నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
అయితే.. జగన్ అదికారంలోకి వచ్చిన తర్వాత.. స్వరూపం మారిపోయింది. మూడు రాజధానులను తెరమీదికి తెచ్చారు. దీనికి ఆయన అమరావతిలో ముందస్తు.. కొనుగోళ్లు జరిగాయని, రైతులను మోసం చేశారని, కమ్మ సామాజిక వర్గం కోసమే దీనిని నిర్మించారని.. ఆరోపించారు.
రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధికి మూడు రాజధానులు అవసరమని ప్రకటించారు. ఈ క్రమంలోనే అమరావతిని కేవలం శాసన రాజధానిగా ప్రకటించారు. కర్నూలును న్యాయరాజధానిగా, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించారు. దీంతో రాజధాని రైతులు ఉద్యమించారు. ఇప్పటికి దాదాపు 700 రోజులుగా రైతులు నిద్రాహారాలు మాని.. వివిధ రూపాల్లోమూడు రాజధానులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇక, ఈ విషయంపై అడపాదడపా స్పందించాల్సి వచ్చిన సమయంలో కేంద్ర ప్రభుత్వం మాట మార్చుతూ వస్తోంది. మూడు రాజధానులపై పార్లమెంటులో అడిగినప్రశ్నలకు తమ పరిధిలో లేదని.. ఒకసారి.. రాష్ట్ర ప్రభుత్వ ఇష్టానికే వదిలేశామని మరోసారి.. ఎన్ని రాజధానులైనా ఉండొచ్చని ఇంకోసారి.. ఇలా చెబుతూ.. అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు వ్యవహరిస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది.
ఏకంగా హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో `ఒక రాజధాని` ఉండాలని మాత్రమే.. విభజన చట్టంలో ఉందని.. `ఒకే రాజధాని` ఉండాల్సిన అవసరం లేదని.. ప్రకటించింది. దీంతో రైతులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశారు.
తాజాగా మరోసారి కూడా కేంద్రం రాజధాని విషయం తప్పుటడుగు వేసింది. ఏపీ రాజధాని విశాఖ అంటూ లోక్‌సభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏపీ రాజధానిగా వైజాగ్‌ను కేంద్రం సూచించింది.
పెరిగిన పెట్రోల్ ధరల ప్రభావం రాష్ట్రాల్లో అంచనా వేశారా అంటూ… ఎంపీ కుంభకుడి సుధాకరన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రధాన నగరాల్లో పెరిగిన పెట్రోల్ ధరలను కేంద్రం అంచనా వేసింది. అయితే కేంద్రం విడుదల చేసిన రాజధానుల పట్టికలో ఏపీ రాజధానిగా విశాఖగా పేర్కొంది.
గతంలో ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని కేంద్రం చెప్పింది. న్యాయపరిధిలో ఉన్న అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించడాన్ని అమరావతి జేఏసీ వ్యతిరేకిస్తోంది.
ఏపీ రాజధానిపై చాలాకాలంగా రగడ నడుస్తోంది. మూడు రాజధానుల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని జేఏసీతో పాటు పలు సంఘాలు చాలాకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
అయితే.. ఎప్పటికప్పుడు దీనిపై ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం.. నిరసనలు రాగానే మళ్లీ మాటమార్చడం.. కేంద్రం వంతుగా మారిపోయింది. ఇప్పుడు ప్రకటించిన విశాఖ రాజధాని విషయంలోనూ తాజాగా మళ్లీ మాట మార్చింది. “విశాఖ కేవలం నగరమే. క్యాపిటల్ కాదు. ఇది తప్పుగా జరిగిపోయింది.
ఈ విషయాన్ని లోక్‌సభ సచివాలయానికి కూడా చెప్పాం“ అంటూ.. మరోసారి వివరణ ఇవ్వడం గమనార్హం. అయితే.. ఇలాంటి వివాదాస్పద అంశాలపై కేంద్రం ఇంత తేలికగా తప్పులు చేయడం.. వెంటనే సరిదిద్దుకోవడం వంటి వి సమంజసంగా లేవని అంటున్నారు పరిశీలకులు.