పల్లా శ్రీనివాసరావు… మెల్లమెల్లగా ఫైర్ బ్రాండ్ గా రూపాంతరం చెందారు. వైసీపీ బెదిరింపులు, ప్రలోభాలు, వేధింపులతో పలువురు తెలుగుదేశం నేతలు పార్టీ మారుతుంటే… పల్లా శ్రీనివాసరావు మాత్రం బలమైన నాయకుడిగా రూపాంతరం చెందారు. విశాఖ కేంద్రంగా విజయసాయిరెడ్డి రాజకీయాలను నిత్యం ఎండగడుతూ ఆయనకు నిద్రలేకుండా చేస్తున్నారు పల్లా.
అక్రమాలు, కబ్జా విషయంలో ఎప్పటికపుడు వైసీపీ నేతల బండారాన్ని బయటపెడుతున్నారు. రాజకీయ వేధింపులను గట్టిగా ఎదుర్కొంటూ కేడర్ ను కాపాడుకుంటున్నారు. తాజాగా మాట్లాడిన ఆయన విజయసాయిరెడ్డికి గట్టి షాకులే ఇచ్చారు.
2020 ఏప్రిల్ నుంచి వైసీపీ నేతలు తనను ఆక్రమణదారుడు అని నిరూపించడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు. నాపై వైసీపీ చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఒకవేళ ఆరోపణలు తప్పని తేలితే విజయసాయిరెడ్డి విశాఖను వదిలిపెట్టేస్తారా? అని సవాల్ విసిరారు టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు. విజయసాయి రాజకీయాలకు ఉత్తరాంధ్ర ప్రజలు భయంతో వణుకుతున్నారని… 2024 తర్వాత విజయసాయి విశాఖలో ఉండరు అని… అన్నారు.
నన్ను వైసీపీలోకి రమ్మని పదేపదే పిలిచారు. నేను వెళ్లలేదు. ఆ కక్షతోనే విజయసాయిరెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని పల్లా ఆరోపించారు. రూ. 750 కోట్ల విలువైన 49 ఎకరాల భూమిని తాను ఆక్రమించినట్టు ప్రచారం చేస్తున్నారు. నిజంగా తాను ఆ భూమిని ఆక్రమించి ఉంటే ముందస్తు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. తనపై వస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్టు పల్లా ప్రకటించారు.
యాదవ జగ్గరాజుపేట గ్రామంలో తన కుటుంబానికి ఉన్న 41.30 ఎకరాల జిరాయితీ భూమికి సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లోనూ చూపించానని, ఈ భూములకు ఆనుకుని అక్కడక్కడా 75 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని, విక్రయిస్తే కొంటాను అన్నారు. అసలు ఈ భూమి టీడీపీ అధికారంలోకి రాక ముందు 2013లోనే నా పేరుపై ఉందన్నారు. ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేశానని పల్లా అన్నారు.