వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీలో టికెట్ల వ్యవహారం పుంజుకున్న విషయం తెలిసిందే. సిట్టింగు లను మార్చేసి కొత్తవారికి ఛాన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా కొందరిని ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారుస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లానరసారావుపేట పార్లమెంటు స్థానాన్ని సిట్టింగు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కు ఇచ్చేది లేదన్న వైసీపీ.. ఇక్కడ నుంచి బీసీని నిలబెడతా మని చెప్పింది. ఈ క్రమంలో తాజాగా ఇప్పటికే నిర్ణయించిన స్థానాలను కూడా మరోసారి మార్చింది.
దీని ప్రకారం.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల రాజీనామాతో ఏర్పడిన నర్సరావుపేట పార్లమెంట్ స్థానం ఖాళీని బీసీ నాయకురాలు, మంత్రి విడదల రజనీకి కేటాయించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆమె చిలకలూరిపేట ఎమ్మెల్యే కమ్ మంత్రిగా ఉన్నారు. ఇటీవల నియోజకవర్గాల మార్పులో ఆమెకు గుంటూరు వెస్ట్ స్తానం ఇచ్చారు. దీంతో గత వారం రోజులుగా ఆమె ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు.
అయితే.. అనూహ్యంగా ఆమెకు పార్లమెంటు స్థానం ఖరారు చేస్తూ.. తాజగా సీఎం జగన్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి రజనీ.. ఆర్థికంగా కూడా బలంగా ఉండడం.. ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఉభయ కుశలోపరి అన్న విధంగా రాజకీయం కలిసి వస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. పైగా.. జిల్లాలోనూ మంచి పట్టు పెంచుకున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆమె అయితే.. బలంగా పోటీ ఇస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
టీడీపీ విషయాన్ని గమనిస్తే.. ప్రస్తుతం ఈ సీటు కోసం.. ఇద్దరి నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. ప్రముఖ డాక్టర్ ఒకరు ఈ సీటు పై కన్నేశారు. అదేసమయంలో భాష్య విద్యాసంస్థల అధినేత కూడా తలపడుతున్నారు. అయితే.. సిట్టింగ్ ఎంపీ లావు పార్టీ మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకు ఛాన్స్ ఇచ్చే దిశగా టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిని గమనించిన వైసీపీ బీసీ మంత్రం పఠిస్తూ.. ఇక్కడ రజనీకి అవకాశం ఇచ్చింది. ఆమె నియామకం ఖరారైతే.. నరసరావుపేట హిస్టరీలో తొలిసారి బీసీకి సీటు ఇచ్చినట్టు అవుతుంది. గెలుపు ఓటములు పక్కన పెడితే… ఈ ప్రభావం భారీగానే ఉంటుందని అంటున్నారు.