సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే తన ప్రాంతంపై తనకు మాత్రమే పట్టుండాలని ఆరాటపడుతుంటాడు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా తన నియోజకవర్గ పరిధిలో తన హవానే కొనసాగాలనుకుంటారు. తన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమం, ప్రతి విషయం తన కనుసన్నల్లోనే జరగాలని భావిస్తుంటారు. తమ సొంత పార్టీకి చెందిన ఎంపీలైనా సరే ప్రొటోకాల్ ప్రకారం వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారేమో గానీ సింహభాగం క్రెడిట్ తమకే దక్కాలని ఎమ్మెల్యేలు రచ్చ చేస్తుంటారు.
గతంలో వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంత్రి విడదల రజని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుల మధ్య ఈ తరహా రచ్చ జరగడం చర్చనీయాంశ మైంది. ఇప్పుడు తాజాగా అదే తరహాలో ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు నియోజకవర్గంపై పట్టు విషయంలో పేచీ పెట్టుకున్నారు. ఓ పెళ్లి ఆహ్వాన పత్రికను సీఎంకు అందించే విషయంలో మొదలైన వివాదం చినికి చినికి గాలి వానగా మారిన వైనం ఇప్పుడు వైసీపీ అంతర్గత వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే సామినేని ఉదయభానులు ఒకరినొకరు దూషించుకున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. తన నియోజకవర్గంలోని వ్యక్తులను సీఎం జగన్ దగ్గరకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను తీసుకువెళ్లడంపై వెల్లంపల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, తాను కూడా ఎమ్మెల్యేనని, అందుకే వారిని తీసుకెళ్లాలని ఉదయభాను జవాబివ్వడంతో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన తనకు సమాచారం ఇవ్వకుండా సీఎంను కలవడంపై కూడా వెల్లంపల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయవాడ వెస్ట్ కు చెందిన వైసిపి నాయకుడు ఆకుల శ్రీనివాసరావు తన కుమారుడి పెళ్లి వెడ్డింగ్ కార్డును జగన్ కు ఇవ్వాలనుకున్నారు. అయితే, తనకు సన్నిహితుడైన ఉదయభానుతో కలిసి జగన్ ను ఆయన కలిశారు. ఇది, వెల్లంపల్లికి నచ్చలేదు. మరోవైపు, ఇటీవల తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై కూడా ఉదయభాను కినుక వహించారు. ఆ తర్వాత తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఉదయభానును జగన్ పిలిచి బుజ్జగించారు.
అప్పటినుంచి తన జిల్లాకు చెందిన కొందరు నేతలపై ఉదయభాను తీవ్ర అసహనంతో ఉన్నారు. ఆ నేతల్లో వెల్లంపల్లి కూడా ఉన్నారని, అందుకే వెల్లంపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.