సినీ రంగంలో ఫలానా యంగ్ హీరోకు, ఫలానా యంగ్ బ్యూటీకి మధ్య ఏదో ఉందని, వారిద్దరూ ఫలానా చోట జంటగా తమ కంట పడ్డారని మీడియాలో వచ్చే కథనాలకు కొదవేం లేదు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నలు రిలేషన్ షిప్ లో ఉన్నారని చాలాకాలంగా మీడియా, సోషల్ మీడియా కోడై కూస్తున్నా…వారిద్దరూ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. కాబట్టి, అది పుకారుగానే మిగిలిపోయింది.
ఇదే కోవలో మెగా ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల మధ్య చాలాకాలంగా లవ్ స్టోరీ నడుస్తోందని, త్వరలో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ వ్యవహారంపై వారిద్దరూ ఎప్పుడూ పెదవి విప్పలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పుకార్లకు తోడుగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఈ నెల 9వ తేదీన జరగబోతోందంటూ మరో ప్రచారం మొదలైంది.
కుటుంబసభ్యులు, కొంత మంది అతిథుల సమక్షంలో ఈ జంట ఎంగేజ్ మెంట్ కార్యక్రమం ఉంటుందని ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్, లావణ్యలు విదేశీ పర్యటనలో ఉన్నారని, 1వ తేదీ రాత్రి హైదరాబాద్ కు చేరుకోగానే నిశ్చితార్థంపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తాను రోమ్ లో ఉన్నానని వరుణ్ తేజ్ ఇన్ స్టాలో ఓ ఫొటో షేర్ చేయగా.. తాను కూడా ప్రయాణంలో ఉన్నట్టు లావణ్య చెప్పింది. దీంతో, ఈ జంట రోమ్ లో రోమింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా, మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు లేదా మరొకరు ఈ ఎంగేజ్ మెంట్ పై అఫిషియల్ గా ప్రకటన ఇస్తేగానే క్లారిటీ రాదు.