మన్మోహన్ సింగ్ ను యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ గా పిలవటం తెలిసిందే. ఆ మాటకు వస్తే. ఈ పేరు మీద మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు ఒక పుస్తకాన్ని రాశారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగానే కాదు.. దాని కంటే ముందుగా దేశ ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఆయనకు ఆ పదవిని ఆఫర్ చేసినప్పుడు.. ఆయన ఎలా ఫీల్ అయ్యారు? ఎలా స్పందించారన్న సంగతి తెలిస్తే ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేసిన మన్మోహన్ కు.. దేశ ఆర్థిక మంత్రిగా అవకాశం ఇస్తున్నట్లుగా చెప్పిన విషయాన్ని ఆయన అస్సలు నమ్మలేదట. ఇదే విషయాన్ని మన్మోహన్.. స్వయంగా ఒక వేదిక మీద వెల్లడించారు.
తనకు దేశ ఆర్థిక మంత్రిగా అవకాశం కల్పిస్తూ.. నాటి ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయం గురించి చెప్పిన మన్మోహన్ సింగ్.. ‘‘1991 జూన్ 21న భారత ప్రధాని పీవీ నరసింహారావు నుంచి ఫోన్ వచ్చింది. మన్మోహన్జీ మీరెక్కడున్నారు? అని పీవీ అడిగారు. నేను యూజీసీలో ఉన్నానని చెప్పా. మీకు అలెగ్జాండర్ ఏమీ చెప్పలేదా? అని పీవీ అడిగారు.
చెప్పాడు కానీ, నేను సీరియ్‌సగా తీసుకోలేదని అన్నాను. ‘లేదు.. ఇది చాలా సీరియస్, మీరు ఇంటికి వెళ్లి డ్రెస్ చేసుకుని ప్రమాణ స్వీకారానికి రండి’ అని పీవీ చెప్పారు’’ అని అప్పట్లో ఏం జరిగిందో చెప్పిన మన్మోహన్ అందరిని నవ్వించారు. ఇదంతా 2018 డిసెంబరులో తన పుస్తకం చేంజింగ్ ఇండియా ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించారు.
యూజీసీ ఛైర్మన్ గా విధులు నిర్వహిస్తున్న తాను.. ప్రధానమంత్రి నుంచి ఫోన్ రావటంతో అప్పటికప్పుడు వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినట్లుగా వెల్లడించినప్పుడు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ అంశం మన్మోహన్ లోని మరో యాంగిల్ ను చూపిస్తుంది. పదవుల కోసం ఆయన ఎప్పుడు పాకులాడలేదు పదవులే ఆయన వద్దకు పరుగులు పెడుతూ వచ్చాయి. పీవీ నరసింహారావు ఇచ్చిన మనో ధైర్యం వల్లే తాను ఆర్థిక సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినట్లుగా చెప్పటం ద్వారా.. పీవీ తనకు ఇచ్చిన అవకాశాల్ని ఆయన చెప్పకనే చెప్పినట్లైంది.
ఇప్పటి నేతల మాదిరి తీవ్రమైన ఆరోపణలు చోటు చేసుకున్నప్పుడు తమ పదవులకు రాజీనామా చేయకుండా.. కుర్చీలను అంటిపెట్టుకొని ఉండటం తెలిసిందే. తన బాధ్యత లేకున్నా.. బాధ్యత తీసుకొని రాజీనామా లేఖను ఇచ్చేసిన గొప్ప వ్యక్తిత్వం మన్మోహన్ సొంతం. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
స్టాక్ మార్కెట్ కుంభకోణంపై రిపోర్టు సమర్పిస్తూ.. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా నిద్ర పోతున్నట్లుగా జేపీసీ పేర్కొంది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ.. లేఖను అందజేశారు అయితే.. పీవీ దాన్ని ఆమోదించలేదు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశాల్లో మన్మోహన్ పై ఎన్ని విమర్శలు వచ్చినా.. వాటికి పీవీనే స్పందించేవారు.
తానే స్వయంగా జవాబులు ఇచ్చేవారు. ఇలా మన్మోహన్ మీద ఈగ వాలనివ్వకుండా పీవీ జాగ్రత్తలు తీసుకునేవారు. దీనికి తగ్గట్లే.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని జీవితాన్ని మన్మోహన్ నిర్వహించారు. తన చుట్టూ బురద ఉన్నప్పటికీ.. ఏ రోజు కూడా దానిని తనకు అంటకుండా జాగ్రత్తగా ఉండేవారు. అదీ.. మన్మోహన్ అంటే.