మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా.. అండర్ వరల్డ్ డాన్ గా పేరున్న దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే.. జరుగుతున్న ప్రచారం నిజమా? అబద్ధమా? అన్నది ఒక ప్రశ్నగా మారింది. అసలు సంగతేమంటే.. దావూద్ ఇబ్రహీం మీద విష ప్రయోగం జరిగిందని.. అతను ప్రస్తుతం పాకిస్థాన్ లోని కరాచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
అయితే.. దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. అయితే.. ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా చెబుతున్న ఆసుపత్రిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. 1993 ముంబయి పేలుళ్ల సూత్రధారి అన్న సంగతి తెలిసిందే. అతని కోసం భారత సర్కారు.. భారత సీక్రెట్ సర్వీస్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా.. ఇప్పటివరకు ఎలాంటి ఫలితాలు వచ్చింది లేదు.
ముంబయి పేలుళ్ల ఉదంతంలో దాదపాు 250కు పైగా సామాన్య ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవటం తెలిసిందే. వేలాది మంది గాయపడ్డారు. 2008లో జరిగిన 26/11 ఉగ్రదాడుల సమయంలోనూ పాకిస్థానీ ఉగ్రవాదులకు ముంబయిలో దావూద్ నెట్ వర్కు నుంచి సాయం అందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వారి ద్వారానే.. ఉగ్రవాదులకు అవసరమైన ఆయుధాల్ని అందించినట్లుగా చెబుతారు. అయితే.. దీనికి సంబంధించిన ఆధారాలు అందిస్తామని చెప్పినా పాక్ దానికి సానుకూలంగా స్పందించింది లేదు.
దావూద్ ఇబ్రహీం రెండో పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి కరాచీలో ఉంటున్నాడన్న ప్రచారం ఉంది. అదే విషయాన్ని అతడి సోదరి హసీనా పార్కర్ కుమారుడు ఎన్ఐకి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, దోపిడీ, ఆయుధాల స్మగ్లింగ్ వంటి నేర కార్యకలాపాలలో అతని హస్తం ఉంది. అతడ్ని చంపినా.. ప్రాణాలతో పట్టుకున్నా 25 మిలియన్ డాలర్లు ఇస్తామని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉంటే.. అనూహ్యంగా ఇప్పుడు దావూద్ ఇబ్రహీం మీద విష ప్రయోగం జరిగిందని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ వార్తలకు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.