శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పరిటాల సిద్ధార్థపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం శ్రీనగర్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన సిద్ధార్థ బ్యాగులో 5.56 క్యాలిబర్ బుల్లెట్ లభించడం కలకలం రేపింది. అయితే, దీనిపై వివరణ ఇవ్వాలని సిద్ధార్థకు పోలీసులు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో సిద్ధార్థను పోలీసులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఈ వ్యవహారంలో మరో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది.
సిద్ధార్థ లైసెన్స్డ్ గన్‌కు, బ్యాగులో దొరికిన బుల్లెట్‌కు తేడా ఉందని పోలీసులు గుర్తించారు. పాయింట్ 32 క్యాలిబర్ గన్‌కు సిద్ధార్థ్ లైసెన్స్ పొందగా… సిద్ధార్థ బ్యాగులో 5.56 క్యాలిబర్ బుల్లెట్ పోలీసులకు దొరకడం కలకలం రేపింది. ఆ బుల్లెట్ ను సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్ బుల్లెట్ గా పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ బుల్లెట్ సిద్ధార్థకు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సిద్ధార్థ్ బ్యాగులో దొరికిన తూటా అనంతపురానికి చెందిన ఇండో టిబెటెన్ బోర్డర్ కానిస్టేబుల్ దిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్‌తో పరిటాల కుటుంబానికి పరిచయాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, పోలీసుల నోటీసులకు సిద్ధార్థ సరైన సమాధానం ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారుల సలహాతో ఎయిర్ పోర్ట్ పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విచారణకు మరోసారి హాజరు కావాల్సి ఉంటుందని సిద్ధార్థకు పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, ఈ వ్యవహారంలో సిద్ధార్థ చుట్టు ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది.