ఎవరెన్ని చెప్పినా ట్రాఫిక్ నిబంధనల్ని వీలైనంత ఎక్కువగా బ్రేక్ చేసే వారే కనిపిస్తారు. కారణం ఏదైనా.. రూల్స్ ను పాటించకుండా వ్యవహరించటం కారణంగా పలు ప్రమాదాలకు.. ట్రాఫిక్ జాంలకు కారణమవుతుంటారు. ఇలాంటి వేళ.. వినూత్న పద్దతిలో సరికొత్త చర్యకు తెర తీశారు ట్రాఫిక్ పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో కాదు కానీ.. ఈ కొత్త ప్రయోగం తెలుగు రాష్ట్రాల్లో.. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో అమలు చేస్తే.. ట్రాఫిక్ సమస్యలు ఒక కొలిక్కి వచ్చే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంతకూ ఈ కొత్త విధానంలో ఎవరైనా ఒకరు ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే.. చలానా అతడికి కాకుండా అతడు పని చేసే కంపెనీకి వెళుతుంది. దీంతో.. అతను బాస్ కు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంతకూ ఈ వినూత్న ఐడియా ఎక్కడ అమలు చేస్తున్నారంటే.. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఈ కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. నగరంలోని ఐటీ కారిడార్ లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో.. వాహనదారులు మరింత జాగ్రత్తతో వాహనాన్ని నడిపే వీలుందన్న మాట వినిపిస్తోంది.
రెండు వారాల క్రితం ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాంగ్ సైడ్ లో ప్రయాణించే వారు.. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారిని లక్ష్యం చేసుకుంటున్న పోలీసులు.. వారు ఏ కంపెనీలో పని చేస్తున్న విషయాన్ని వారి ఐడీ కార్డుల ద్వారా తెలుసుకొని.. చలానాను వారి కంపెనీకే పంపనున్నారు. దీంతో.. సమస్య ఒక కొలిక్కి రావటమే కాదు.. బాధ్యతగా డ్రైవ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తారని చెబుతున్నారు. ఈ విధానంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికి.. వాహనదారులు మరింత బాధ్యతగా వ్యవహరించేందుకు.. వాహనాల్ని నడిపేందుకు మాత్రం సాయం చేస్తుందని మాత్రం చెప్పక తప్పదు.