ఇటీవల కాలంలో వరుస పెట్టి విషాదాలు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎదురవుతున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఒకరు తర్వాత ఒకరు అన్నట్లుగా కన్నుమూస్తున్నారు. వయసు మీద పడటం దీనికో కారణంగా చెప్పొచ్చు. తాజాగా ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ మూరారి కన్నుమూశారు.
78 ఏళ్ల ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. 1944లో విజయవాడలో జన్మించిన ఆయన.. సినీ నిర్మాతగా సుపరిచితులు.
సీతామహలక్ష్మీ.. గోరింటాకు.. జానకీ రాముడు.. నారి నారి నడుమ మురారి.. అభిమాన్యుడు.. త్రిశూలం.. సీతారామ కల్యాణం.. శ్రీనివాస కల్యాణం.. జేగంటలు ఇలా.. ఆయన పలు సినిమాల్ని నిర్మించారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. డాక్టర్ చదువు మానేసి మరీ చిత్ర దర్శకుడిగా మారాలని.. తన సత్తా చాటాలని తపించిన ఆయన చిత్ర రంగ ప్రవేశం తర్వాత ప్రముఖ నిర్మాతగా స్థిరపడ్డారు.
వాణిజ్య చిత్రాల్ని మంచి విలువలతో నిర్మించే అభిరుచి కలిగిన నిర్మాతగా ఆయనకు పేరుంది. నిర్మాతగా మారక ముందు ఆయన పలువురు ప్రముఖ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయటం విశేషం.
వి. మధుసూదనరావు.. కోదండరామిరెడ్డి లాంటి దర్శకుల వద్ద సహాయక దర్శకులుగా పని చేసిన ఆయన.. సూపర్ స్టార్ క్రిష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రానికి కొన్నిరోజులు పాటు పని చేసినట్లుగా చెబుతారు.