టాలీవుడ్ లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతితో యావత్ సినీలోకం శోక సంద్రంలో మునిగిన సంగతి తెలిసిందే. సిరివెన్నెల హఠాన్మరణంతో సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. సిరివెన్నెలను కడసారి చూసేందుకు పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. ఫిలిం ఛాంబర్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి హీరో చిరంజీవి నివాళులర్పించారు. చిత్రపరిశ్రమకు సిరివెన్నెల లేని లోటు తీరనిదని, దానిని ఎవరూభర్తీ చేయలేరని చిరు అన్నారు. సమాజాన్ని మేలుకొలిపే, సమాజం ఆలోచించేలా పాటలు రాయడం సిరివెన్నెల ప్రత్యేకత అని కొనియాడారు.
సిరివెన్నెల అనారోగ్య సమస్యలు తనకు తెలియగానే…చెన్నై వెళ్లి చికిత్స చేయుంచుకుందామని చెప్పానని, ఈ లోపే ఈ వార్త వింటామని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిమ్స్ హాస్పిటల్ లో చేరేముందు తనతో ఫోన్లో మాట్లాడారని, పుట్టిన వెంటనే ఎవరూ మెగాస్టార్ కాలేరని సిరివెన్నెల అన్న మాటలను చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
మరోవైపు, అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా సిరివెన్నెల పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ వార్త విన్న తర్వాత నకు నోట్లో నుంచి మాట రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు శాస్త్రిగారు అంటే చాలా ఇష్టమని, అమ్మానాన్నల తరువాత ఆయనే అని చెప్పారు. సిరివెన్నెల చనిపోవడం చాలా బాధాకరమని,. ఆయన ఎప్పటికీ మన మనసులో బ్రతికే ఉంటారని అన్నారు.
అంతకుముందు, జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివ దేహానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళి అర్పించారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, శ్రీకాంత్, శర్వానంద్, మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి పేర్ని నాని తదితరులు సిరివెన్నెలకు నివాళులర్పించారు.