తెలంగాణ హైకోర్టుకు ఆగ్రహం వచ్చింది. నిజానికి దాన్ని ధర్మాగ్రహం అనటం సబబుగా ఉంటుందేమో? వ్యవస్థలు చేస్తున్న తప్పులు ప్రజల జీవితాలకు ప్రమాదకరంగా మారుతున్న వేళ.. న్యాయం కోసం తమను ఆశ్రయించిన నేపథ్యంలో.. విచారణ చేపట్టిన న్యాయస్థానం తమ ముందుకు వచ్చిన వివరాలు.. ఆధారాలతో పాటు ఇరు వర్గాల వాదనల్ని విన్న తర్వాత.. రాష్ట్ర ఎన్నికల సంఘంపైనా.. రాస్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చర్రుమనిపించే వ్యాఖ్యలు చేసింది.
కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న నిర్ణయాలపై విస్మయం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ‘భూమి మీద నివిస్తున్నారా? ఆకాశంలోనా? యుద్ధం వచ్చినా.. ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా?’ అని ప్రశ్నించింది. అసలు ఎన్నికల సంఘం అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని గమనిస్తున్నారా? అంటూ మండిపడింది. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు విలవైనవా? ఎన్నికలా? అని నిలదీసిన కోర్టు.. కొన్ని మున్సిపాలిటీలకు ఇంకా సమయం ఉంది కదా? ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటన్నసందేహాన్నివ్యక్తం చేసింది.
హైకోర్టు సందేహానికి సమాధానం చెప్పే ప్రయత్నంలో ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది వినిపించిన వాదనలపై కోర్టు మరింత మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికల్ని నిర్వహించినట్లుగా చెప్పటంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు.. ‘ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదా? ఎన్నికల ప్రచార సమయం కూడా ఎందుకు తగ్గించలేదు?’ అని ప్రశ్నించింది.
కరోనా కట్టడిని వదిలేసి.. ఎన్నికల పనుల్లో ఉండే పరిస్థితి ఉందన్న హైకోర్టు.. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు విచారణకు హాజరు కావాలని కోరారు. కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళలో ఎన్నికల నిర్వహణ సబబు కాదన్న మాట పలువురి నోటి నుంచి వచ్చినా.. అదేమీ పట్టకుండా ప్రభుత్వం మొండిగా నిర్వహించిన వైనంపై హైకోర్టు ఆగ్రహం ఇప్పుడు సంచలనంగా మారింది.