తెలంగాణ రాజకీయాల్లో కనుమరుగైన తెలుగుదేశం పార్టీ.. మళ్లీ పురుడుపోసుకోబోతుందా..! అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. తాజాగా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు.. తెలంగాణలో అక్కడో, ఇక్కడో మిగిలిన టీడీపీ నేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక స్థానిక సంస్థల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించినట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభ వేగంగా తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది టీడీపీ. ఐతే తర్వాత ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరకడం, చంద్రబాబు హైదరాబాద్ నుంచి ప్రభుత్వాన్ని అమరావతికి తరలించడం వెంటవెంటనే జరిగిపోయాయి. తర్వాత క్రమంగా తెలంగాణలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పలువురు టీఆర్ఎస్లో చేరగా.. కొంతమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచే కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. తర్వాత ఆ ఇద్దరూ సైతం గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ తెలంగాణలో జీరో అయింది. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం..కాస్తో, కూస్తో బలం ఉన్న ఖమ్మంలో కాంగ్రెస్కు బహిరంగంగానే మద్దతు తెలిపింది. ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో తెలంగాణలో మళ్లీ రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ పునఃనిర్మాణం దిశగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.
అధ్యక్ష పదవి ఎవరికో?
కొంతకాలంగా తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. పునఃనిర్మాణంలో భాగంగా పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుందని చంద్రబాబు ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏ సామాజికవర్గానికి ఇస్తారనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్న ఈ తరుణంలో ఇక్కడ టీడీపీ పగ్గాలు ఎవరికి ఇస్తారు అనేది ఉత్కంఠగా మారింది. అయితే చంద్రబాబు మాత్రం అధ్యక్ష ఎంపిక విషయాన్ని పక్కనబెట్టి.. మొత్తం రాష్ట్ర కమిటీలనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి అడ్ హాక్ కమిటీలు వేస్తున్నామని, ఆ తరువాత అధ్యక్ష పదవి పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ, తెలంగాణలో టీడీపీ అధ్యక్ష పదవిని ఈసారి ఓసీలు ఆశిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో పార్టీ పగ్గాలను ఒక్కసారి కూడా ఓసీలకు ఇవ్వలేదు. గతంలో బీసీ నేతలైన ఎల్ రమణ, కాసాని జ్ఞానేశ్వర్ కు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన బక్కని నర్సింహులు కు పార్టీ బాధ్యతలు అప్పగించారు. గడిచిన పదేళ్ళలో ముగ్గురు బడుగు, బలహీనవర్గాలకు చెందిన నేతలకే బాబు అవకాశం ఇచ్చారు. కాగా ఈసారి ఓసి లకు అవకాశం వస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నేత,పార్టీ ఉపాధ్యక్షుడు సామ భూపాల్ రెడ్డి, నన్నూరి నర్సిరెడ్డి, కాట్రగడ్డ ప్రసూనతో పాటు మరికొంత మంది నేతలు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ ఎన్నికల్లో పార్టీ బలంగా పోటీలో ఉండాలంటే కేడర్ కు దిశానిర్దేశం, నేతలను సమన్వయం చేయడం,కార్యకర్తల్లో ఉత్సాహం నింపే సమర్థవంతమైన నాయకుడు అవసరం. అందుకే పార్టీ అధినేత ఈ అంశంపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతకు బాధ్యతలు అప్పగిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉంటుందనే యోచనలో చంద్రబాబు ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
టీడీపీలో చేరనున్న ఎమ్మెల్యే?
తెలంగాణలో టీడీపీని పునర్ నిర్మించేందుకు అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు తెలుగుదేశంలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆయన ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారని అంటున్నారు. ఇతర రాజకీయ పరిణామాలను బట్టి.. ఆయన టీడీపీలో చేరిపోతారని ప్రచారం జరుగుతోంద. ఎమ్మెల్యే మాత్రమే కాకుండా.. మరి కొంత మంది సీనియర్ నేతలు టీడీపీలోకి ఘర్ వాపసీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి, సినీనటుడు బాబూమోహన్ పసుపు చొక్కా వేసుకుని మరీ టీడీపీ ఆఫీసుకు వచ్చారు. ఆయనతో పాటు మరికొంత మంది నేతలూ చర్చల్లో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడి నియామకం తర్వాత పలువురు నేతలు టీడీపీలో చేరతారని చెబుతున్నారు.