ఒక్క చాన్స్..ఒకే ఒక్క చాన్స్ అంటూ 2019 ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత జగన్ జనాల దగ్గర ఓట్లు అడిగిన సంగతి తెలిసిందే. సరేలే అని జగన్ కు ఒక్క చాన్స్ ఇచ్చిన జనానికి…రెండున్నరేళ్ల పాలన తర్వాత పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పల ఊబిలో ఏపీని ముంచిన జగన్…రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి నెత్తిపై ఐదు లక్షల రూపాయల అప్పు మిగిల్చారు. ఇక, సంక్షేమ పథకాలపేరుతో పప్పు బెల్లాల్లాగా ట్యాక్స్ పేయర్ల డబ్బును దుబారా చేస్తున్నారు.
ఇలా అవకతవకల పాలనలో జగన్ ఓ మైలు రాయిని చేరుకున్నారు. తాజాగా జగన్ 1000 రోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే జగన్ వెయ్యి రోజుల పాలనపై టీడీపీ నేతలు చార్జ్ షీట్ విడుదల చేశారు. ”వేయి రోజుల పాలన.. వేయి తప్పిదాలు” అంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాజప్ప, నక్కా ఆనందబాబు, దీపక్ రెడ్డి, అశోక్ బాబు ఛార్జ్ షీట్ విడుదల చేయడం చర్చనీయాంశమైంది. జగన్ 1000 రోజుల పాలనలో వెయ్యి తప్పులంటూ టీడీపీ పుస్తకం విడుదల చేసింది. జగన్ విధ్వంస పాలనలో 1000 నేరాలు, ఘోరాలు, లూటీలు, అసత్యాలు పేరిట ప్రజా ఛార్జ్ షీట్ ను టీడీపీ విడుదల చేసింది.
ప్రజావేదిక కూల్చివేత వంటి అశుభ ఘటనతో పాలన ప్రారంభించిన సీఎం జగన్ ఒక్కరేనని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, దాంతో 135 సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని అన్నారు. రూ. 2 లక్షల కోట్ల సంపదకు నెలవైన అమరావతిని చంపేశారని, మునుపెన్నడూ లేని విధంగా దేవాలయాలపై దాడులకు తెగబడ్డారని దు్యబట్టారు. సొంత బాబాయి వివేకాతో పాటు కోడెల, మాస్క్ అడిగిన వైద్యుడు సుధాకర్ ఇలా ఎంతోమంది చావులకు జగన్ ప్రభుత్వమే కారణమని అచ్చెన్నాయుడు విమర్శించారు.
దాడులు, కిడ్నాపులు బెదిరింపులతో స్థానిక సంస్థల ఎన్నికల్ని జగన్ అపహాస్యం చేశారని చినరాజప్ప మండిపడ్డారు. సొంత కంపెనీ సిమెంట్ ధరలు పెంచేందుకు ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. గత 1000 రోజులుగా వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిన ప్రభుత్వ నిర్ణయాలు.. రైతుల్ని మానసిక వేదనకు గురిచేస్తూనే ఉన్నాయని దుయ్యబట్టారు. రైతులకు ధాన్యం బకాయిలు సకాలంలో చెల్లించకుండా నెలలు తరబడి పెండింగులో పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ ‘థౌజండ్’ వాలా…తుస్సుమందంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.