ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ వ్యవహారం రాజకీయపరంగా పెను దుమారం రేపుతోంది. రేట్లు తగ్గించడంపై మాట్లాడిన హీరో నానిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రెమ్యున్ రేషన్ తగ్గించుకోవాలంటూ ఉచిత సలహాలిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో నానితోపాటు టికెట్ రేట్ల వ్యవహారంపై మాట్లాడిన సినీ ప్రముఖులకు టీడీపీ నేతలు మద్దతుగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలోలోనే ఈ వ్యవహారంపై తాజాగా టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. టికెట్ రేట్లు తగ్గించిన వారు…సాక్షి పత్రికను రూ.1కి అమ్మగలరా అంటూ జగన్ కు గోరంట్ల చురకలంటించారు. సొంత వ్యాపారంలో ఇలా ధరలు తగ్గించగలరా? అంటూ నిలదీశారు. సినిమా టికెట్ల విషయంలో జగన్ సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని చురకలంటించారు.
సాక్షి పత్రిక వచ్చిన కొత్తలో మిగతా పత్రికలు కూడా 2 రూపాయలకే అమ్మాలని చెప్పారని, ఆ తర్వాత అందరితోపాటు రేటు పెంచారని గుర్తు చేశారు. అలా చెప్పిన వారు ఇప్పుడు సాక్షి పేపర్ 1 రూపాయకి ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. కనీసం ఇసుమంత అయినా మనస్సాక్షి లేని సాక్షి రాతలకు రూ.5 పెట్టి కొనాలని, కానీ, సినిమా టికెట్లు మాత్రం తక్కువ రేట్లకు అమ్మాలని ఎద్దేవా చేశారు.
మరోవైపు, సినిమా టికెట్ రేట్లపై చర్చించేందుకు ఏపీ సర్కార్ కొత్త కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఉన్నతాధికారులు, ఎగ్జిబిటర్లు, సినీ గోయర్లతోపాటు హోం, రెవెన్యూ, పురపాలక, ఆర్థిక, సమాచార, న్యాయశాఖ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సినిమా థియేటర్ల వర్గీకరణ, ధరలపై ఈ కమిటీ ప్రతిపాదనలు చేసి ధరలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.