అమెరికా తెలుగు కమ్యూనిటీ ప్రముఖుల్లో ఒకరు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (‘తానా’) మాజీ అధ్యక్షులు ‘గంగాధర్ నాదెళ్ల’ అస్వస్థతకు గురవడం ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనకు గురి చేసింది. ఆయన ప్రస్తుతం వెస్ట్ బ్లూంఫీల్డ్ హెన్రీ ఫోర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగాధర్ అస్వస్థతకు గురి కాగానే ఆయన పరిస్థితిని గుర్తించిన కుమార్తెలు వెంటనే 911కు ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం గంగాధర్‌కు ఆసుపత్రిలో వివిధ రకాల పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుమార్తె తెలిపారు. అమెరికాలోని డెట్రాయిట్ ‘తానా’ నాయకులు శ్రీనివాస్ గోగినేని, సునీల్ పంత్ర, జోగేశ్వర్ పెద్దిబోయిన, కిరణ్ దుగ్గిరాల, సుధాకర్ వెలగ తదితరులు ఆసుపత్రికి చేరుకుని గంగాధర్ పరిస్థితి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. యుఎస్‌లోని ఎన్నారైలు, ‘తానా’ సభ్యులు, గంగాధర్ శ్రేయోభిలాషులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.