ఈ కాలంలో కొంతమంది సినీ తారలు, రాజకీయ నేతలు పెళ్లిళ్లు చేసుకోవడం…కొన్ని సందర్భాల్లో లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండి బ్రేకప్ చెప్పుకోవడం సర్వ సాధారణమయ్యాయి. అలాగే, రాజకీయ నేతలపై కొందరు సినీ తారలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం, కోర్టులకెక్కడం వంటి ఘటనలూ ఉన్నాయి. కొన్నిసార్లు ఈ తరహా ఆరోపణలు రాజకీయ లబ్ది కోసం ప్రత్యర్థులు చేయిస్తుంటారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా, తమిళనాడులో మాజీ మంత్రి మణికందన్ పై వర్థమాన నటి చాందిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం కలకలం రేపింది. మణికందన్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనతో తనకు 5 సంవత్సరాలుగా పరిచయం ఉందని, , ఇపుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తనను చంపేస్తానని మణికందన్ బెదిరిస్తున్నారని ఆరోపించింది.
మణికందన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన చాందిని… తనను బెదిరించినట్టుగా కొన్ని సాక్ష్యాలను పోలీసులకు అందించింది. అయితే, చాందిని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని, ఆమెపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని మణికందన్ అంటున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మణికందన్…ఆ తర్వాత టీటీవీ దినకరన్ గ్రూపులో చేరారు. సీఎం పళనిస్వామి వ్యతిరేక కూటమిలో చేరడం వల్ల ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. తాజాగా చాందిని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.