విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ భూములను లేఔట్ గా మార్చి అమ్మడంపై దేశపు అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. 2003 సెప్టెంబర్ 13న ఆనాటి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వురులలో జారీ చేసిన అవసరాలకు తప్ప ఇతర కార్యకలాపాలకు ఆ భూములు వాడకూడదని ఆదేశించింది. ఆ ప్రకారం ఏపీ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ ఆ నోటీసులపై మార్చి 11లోపు స్పందించాలని ఆదేశాలు జారీ చేసింది.
టాలీవుడ్ లో ప్రముఖ రామానాయుడు స్టూడియోకు సినీ అవసరాల కోసం 2003లో ఆనాటి ప్రభుత్వం విశాఖలో 35 ఎకరాల భూమిని కేటాయించింది. కానీ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమిని లేఔట్ గా మార్చి ఇతర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు అనుమతించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేత, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో…రామకృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
స్టూడియోకు ఇచ్చిన స్థలంలో లేఔట్ వేసి ఇళ్లను నిర్మించడం చట్ట విరుద్ధం అయిన్పటికీ జిల్లా కలెక్టర్ ఎన్ఓసీ ఇచ్చారు. అంతేకాదు, దగ్గుబాటి సురేశ్ బాబు పేరు మీదే లేఔట్ వేశారు. ఈ తంతు వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని ప్రచారం జరిగింది.