ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా హయాంలో నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సీఎం అయినందున దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయనే కారణంతో చంద్రబాబు పై సీఐడీ నమోదు చేసిన ఐడు కేసులను సీబీఐకి ఇవ్వాలంటూ బి.బాలయ్య అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా విచారణకు వచ్చిన ఈ పిటిషన్ ను జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం పనికిమాలిన పిటిషన్ అంటూ అభిప్రాయపడింది. పిటిషనర్ బాలయ్య తరఫు న్యాయవాది మణీంద్రసింగ్ వాదనలు వినిపించడానికి సిద్ధం కాగా.. ఇలాంటి పనికిమాలిన పిటిషన్లపై మీలాంటి సీనియర్ న్యాయవాది వాదించడానికి ఎలా వచ్చారని జస్టిస్ బేలా త్రివేది ఘాటుగా స్పందించారు.
మణీంద్రసింగ్ వివరణ ఇవ్వబోగా.. ఒక్క మాట మాట్లాడినా సరే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ బాలయ్య వేసిన పిటిషన్ ను కొట్టిపారేశారు. దీంతో చంద్రబాబుకు ఊరట లభించినట్లైంది. ఇక న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని చూసిన ప్రతిపక్ష నాయకుల ప్రయత్నం బెడిసి కొట్టింది.