రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. కాలం వారిలో చాలానే మార్పులు తీసుకొస్తుంది. అనూహ్యంగా చోటు చేసుకునే రాజకీయ అవసరాలు అప్పటివరకు కత్తులు దూసుకున్న వారిని.. కౌగిలించుకునేలా చేస్తాయి.
గతంలో మాదిరి రాజకీయాల్లో చెప్పిన మాట మీద నిలవటం లాంటివి ఇప్పుడు తక్కువైపోయాయి. అధికారం చుట్టూనే నేతలు నడుస్తున్న పరిస్థితి. ఇలాంటివేళలో.. ఎప్పుడైనా ఏమైనా జరిగే వీలుంది. తాజాగా అలాంటి అనూహ్య పరిణామం ఏపీలో చోటు చేసుకునే అవకాశం ఉందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
దేశ వ్యాప్తంగా అందరి చూపు పడిన తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దిగారు మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ. నిజానికి ఆమెకున్న ఇమేజ్ కు బీజేపీ ఏ మాత్రం సరైన ఆప్షన్ కాదన్న మాట అప్పట్లో వినిపించింది. అయినప్పటికీ.. బీజేపీ వ్యూహం ఏమో కానీ.. ఆమెను రంగంలోకి దించారు. పోటాపోటీగా ప్రచారం సాగింది. ఎన్నికల ప్రచార విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కమిట్ మెంట్ ను ఆమె పలుమార్లు ప్రశంసించారు.
రత్నప్రభను తన సోదరిగా పవన్ అభివర్ణిస్తే.. ఆయన్ను తన తమ్ముడిగా పేర్కొంటూ..ఎర్ర తువాలును రాఖీ మాదిరి కట్టిన వైనం చాలామందికి గుర్తుండే ఉంటుంది. రత్నప్రభ గెలుపు కోసం బీజేపీ నేతల కంటే కూడా పవన్ అండ్ కోనే కష్టపడ్డారన్న మాట బలంగా వినిపించింది. అదే సమయంలో ఆమె చేసిన ట్వీట్లు చర్చగా మారాయి.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని.. ఆయన పాలనా విధానాల పట్ల సానుకూల ట్వీట్లు చేయటం హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యర్థి పార్టీ నేతలను పొగడటం ఏమిటన్న మాట వినిపించినా.. రత్నప్రభ మాత్రం ఆ విషయాల్ని పట్టించుకోలేదు.
అంతేకాదు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా తీరుపైనా సానుకూలంగా స్పందించేవారు. ఆయన తీరును ఆమె మెచ్చుకునే వారు. ఆమె ధోరణిపై విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. నిజానికి ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేసిన వైనంపై బీజేపీ వర్గాలు వ్యతిరేకించాయి. వాస్తవానికి ఈ సీటును జనసేనకు అప్పజెప్పాల్సింది ఉంది. పవన్ సైతం ఈ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలని భావించారు.
స్నేహ ధర్మంలో భాగంగా బీజేపీకి సీటు అప్పజెప్పాల్సి వచ్చింది. తిరుపతి లోక్ సభ పరిధిలో బీజేపీతో పోలిస్తే.. జనసేనకే ఎక్కువ బలం ఉందన్నది వాస్తవం. కానీ.. ఆ విషయాల్ని పట్టించుకోకుండా బీజేపీ.. మొండితనాన్ని ప్రదర్శించి తాను పోటీ చేయాలని కోరి మరి ఓటమిని కొని తెచ్చుకుంది. వైసీపీకి ఉన్న ఆదరణ.. సీఎం జగన్ కున్న పరపతి నేపథ్యంలో ఆ సీటును సొంతం చేసుకోవటం బీజేపీకి కానీ జనసేనకు శక్తికి మించిన పని. కానీ.. ఆ విషయాన్ని పట్టించుకోక పోటీ చేసి ఉన్న పరువును పోగొట్టుకున్న పరిస్థితి.
ఉప ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత రత్నప్రభ మళ్లీ కనిపించలేదు. ఆమె ఎక్కడకు వెళ్లారన్న దానిపైనా సమాచారం లేదు. అటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ ఆమెను పట్టించుకున్నది లేదు. అలాంటిది.. తాజాగా ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా చెబుతున్నారు. అందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.
రత్నప్రభను పార్టీలోకి చేర్చుకొని ఆమెకు నామినేటెడ్ పదవిని ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. బీజేపీలో కొనసాగటం వల్ల ఎలాంటి భవిష్యత్తు లేకపోవటం.. ఇటీవల కాలంలో మోడీ మీద వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోవటం.. ఏపీలో వైసీపీ బలోపేతం అవుతున్న నేపథ్యంలో.. బీజేపీ తరఫున పోటీ చేసిన తప్పును దిద్దుకోవటానికే ఫ్యాన్ పార్టీలో చేరాలని రత్నప్రభ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రత్నప్రభ ఎంట్రీతో బీజేపీకి.. జనసేనను చావుదెబ్బను తీసినట్లు అవుతుందన్నది వైసీపీ వ్యూహకర్తల ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ పరిణామం వాస్తవ రూపం దాలిస్తే మాత్రం.. ప్రజల్లో రెండు పార్టీలు తలెత్తుకునే అవకాశం ఉండదని చెప్పక తప్పదు. అదే సమయంలో జనసేనానికి ఈ పరిణామం భారీ షాకింగ్ గా మారుతుందని చెప్పక తప్పదు.