తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పగ్గాలు చేపట్టిన స్టాలిన్.. ఏంటి.. జైలుకు వెళ్లడం ఏంటి.. నరకం చూడడం ఏంటి? అని నోరెళ్లబెడుతున్నారా? ఆగండాగండి.. ఈ ఘటన ఇప్పటిది కాదు.. ఎప్పుడో.. 23 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఘటన.
అప్పట్లో ఎమర్జెన్సీ కాలంలో.. కేంద్ర సర్కారు చేసిన అఘాయిత్యాలకు బలైమన అనేక మంది నాయకుల్లో ప్రస్తుతం ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న స్టాలిన్.. ఒకరు. పిన్న వయసులోనే ఆయన ఎమర్జెన్సీ కారణంగా.. జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో జైల్లో పెట్టిన బాధలను ఆయన ఇప్పటికీ మరిచి పోలేదంటే.. అవి ఏ రేంజ్లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
డీఎంకే అధినేత, దివంగత ముఖ్యమంత్రి, కవి కరుణానిధి చిన్న కుమారుడైన స్టాలిన్.. డిగ్రీ తర్వాత సొంతంగా ఓ ప్రింటింగ్ ప్రెస్ నడపడం మొదలుపెట్టారు. మంచి రూపమూ, చక్కటి హాస్య చతురత ఉన్నవాడు కాబట్టి… పార్టీ ప్రచార నాటకాల్లో నటిస్తుం డేవారు. ఆ నేపథ్యంలోనే దుర్గతో పెళ్లైంది.
వాళ్ల తొలినాటి ముచ్చట్ల నడుమనే.. దేశంలో అప్పటి ప్రధాని ఇందిరమ్మ ఎమర్జెన్సీ పరిస్థితులు తీసుకువచ్చారు. ఈ క్రమంలో అప్పటి కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దుచేశారు. అంతేకాదు.. ఆ పార్టీ నేతల్ని జైల్లో పెట్టడం మొదలుపెట్టారు. ఆ జాబితాలో కరుణానిధి తనయుడు స్టాలిన్ పేరునీ చేర్చారు.
దీంతో స్టాలిన్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. రోజంతా జీపులోనే తిప్పి.. అర్ధరాత్రి చెన్నై సెంట్రల్ జైలులోని ప్రత్యేక సెల్‌లోకి తీసుకెళ్లారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకన్న విషయం అటుంచి.. చిన్నకుర్రాడన్న జాలి కూడా లేకుండా బట్టలూడదీసి లాఠీలతో చితకబాదారు. ‘నేను ఇక పార్టీ కోసం పనిచేయను’ అని రాసివ్వమన్నారు. ఒప్పుకోకపోవడంతో… పోలీసులు జైలులోని జీవిత ఖైదీల చేత కొట్టించారు.
ఇనుపబూట్లు తొడిగి మరీ తొక్కించారట! అలా ఒకడు స్టాలిన్ కుడిచేయిని తొక్కి… భుజందాకా విసురుగా లాగడంతో అంగుళం మందాన కండలేచి వచ్చింది. ఆ దారుణాన్ని అడ్డుకోబోయిన మరో ఖైదీ, మాజీ మేయర్ చిట్టిబాబు పొట్టపైన తొక్కితే ఆయన అప్పటికప్పుడే రక్తం కక్కుకుని పడిపోయాడు.
అతణ్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేసినా ఫలితంలేక చనిపోయాడు. ఓ రకంగా అతని మరణమే స్టాలిన్‌ని బతికించిందని చెప్పాలి. చిట్టిబాబు మృత్యువు తర్వాత పోలీసులు హింసాకాండని ఆపారు కానీ ఇతరత్రా ఆగడాలు ఆగలేదు. రోజుకోసారి గంజినీళ్లిచ్చి తాగుతున్నంతలోనే మట్టిపోసేవారట! నెలరోజుల తర్వాతే స్టాలిన్‌ని చూడటానికి తల్లినీ భార్యనీ అనుమతించారు. వాళ్లు చూసొచ్చిన వారం తర్వాత స్టాలిన్‌కి తీవ్రంగా వాంతులయ్యాయి. అతనికి అపెండిసైటిస్ అని తేల్చిన వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయాలని చెబితే అందుకు ససేమిరా అన్నారట పోలీసులు. ప్రాణాపాయమని నచ్చచెప్పి వైద్యులే చొరవ తీసుకుని ఆసుపత్రిలో చేర్చారు.
ఆపరేషన్ జరిగిన గంటలోనే తిరిగి జైలుకి తీసుకెళ్లారట పోలీసులు. ఆ నిస్సత్తువకి, శ్వాస సమస్యా తోడై దినదిన గండమన్నట్టు జైల్లో ఏడాది గడిపారు. ఆ సంవత్సరకాలమే స్టాలిన్ రాజకీయ జీవితానికి గట్టి పునాదిగా మారింది. ఎమర్జెన్సీ తర్వాత విడుదలైన స్టాలిన్‌ని.. పార్టీ కార్యకర్తలందరూ ఓ స్టార్‌గానే చూడటం మొదలుపెట్టారు. అతణ్ని డీఎంకే జనరల్ కౌన్సిల్లోకి చేర్చుకోవాలని ప్రతిపాదించారు. సో.. మొత్తానికి తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్.. జైలు కథ ఇదీ..!! కొన్ని విషయాలు.. వినేందుకు చాలా చిత్రంగా ఉంటాయి.. ఇదీ అంతే..!!