ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై వేటు పడబోతోందని, ఆ స్థానంలో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకే తిరిగి పగ్గాలు అప్పజెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ పై, వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించడంలో సోము ఫెయిల్ అయ్యారని, సోము స్థానంలో వేరొకరుంటే ఏపీ సర్కార్ ఉన్న ప్రస్తుత పరిస్థితిని ఓ రేంజ్ లో ఎండగట్టి ఏపీ బీజేపీకి మైలేజ్ తెచ్చేవారని టాక్ వస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై విమర్శలు విషయంలో సోము గేర్ మార్చారు. జగన్ లో మతతత్వ వైఖరి కనపడుతోందని, ముస్లింలపై కేసులు ఎత్తివేస్తున్నారని సోము షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ సెక్యులర్ ముఖ్యమంత్రా? కాదా? అని సోము ప్రశ్నించారు. 2015లో రాయచోటిలో నమోదైన కేసును ఇపుడు ఎత్తివేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఈ విషయంపై సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాస్తానని సోము అన్నారు.
ప్రభుత్వ జీవో లను ఆన్ లైన్ లో నుంచి తీసివేయడం దారుణమని, జీవోలు గతంలోలాగే అందరికీ అందుబాటులో ఉంచాలని సోము డిమాండ్ చేశారు. టిప్పు సుల్తాన్ కన్నా అబ్దుల్ కలాం విగ్రహం పెట్టవచ్చు కదా అని సోము సలహా ఇచ్చారు. వక్ఫ్ బోర్డ్ లకు ప్రభుత్వ నిధులు ఇస్తారని, కానీ టీటీడీ నుంచి మాత్రం నిధులు తీసుకుంటారని, ఇదేం పద్ధతో అర్థం కావడం లేదని మండిపడ్డారు. పైగా, ఈ తరహా చర్యలను ప్రశ్నిస్తే తమపై, తమ పార్టీపై మతతత్వ ముద్ర వేస్తారని సోము ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ హయాంలో తెలుగు భాష నిర్వీర్యమవుతోందని, ఏపీలో తెలుగు భాష కోసం ఉద్యమం చేపడతామని అన్నారు. గిడుగు జయంతిని పురస్కరించుకుని ఈ నెల 29 నుంచి వారం రోజుల పాటు భారీ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ప్రకటించారు. ‘అప్పు-నిప్పు’ పేరుతో ఓ రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో నిర్వహిస్తామని అన్నారు. ఏపీలో సరైన ఇంజనీర్లు లేరని, అందుకే జల వివాదంపై గట్టిగా జగన్ మాట్లాడడం లేదని అన్నారు.
దమ్ముంటే పోతిరెడ్డిపాడును కూల్చివేయాలని తెలంగాణ నేతలకు సోము సవాల్ విసిరారు. తిరుపతిలో ఫ్లై ఓవర్ పేరు మార్పు ముఖ్యం కాదని, ముందు నిర్మాణం పూర్తి చేయాలని సోము చురకలంటించారు. మొత్తానికి బీజేపీ పెద్దలు క్లాస్ పీకడంతోనే సోము గేరు మార్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి, గేరు మార్చినా…రూటు మార్చినా…సోము పదవి ఉంటుందా…ఊడుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.