ఏపీ బీజేపీ చీఫ్.. సోము వీర్రాజు ఇప్పుడు తీవ్ర సంకట పరిస్తితిని ఎదుర్కొంటున్నారు. తాను చేసిన వ్యాఖ్యలు తనకు ఇప్పుడు రివర్స్ కావడంతో ఆయన తీవ్రస్థాయిలో మథన పడుతున్నారు. ఇటీవల విశాఖ ఉక్కు ఉద్యమం.. అక్కడి ఉద్యోగులు రోడ్డెక్కడంపై సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘చిన్న ట్వీట్‌కే అంత రాద్ధాంతమా? విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారా? పోనీ ఏదైనా అధికారిక ప్రకటన వచ్చిందా?’ అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు.. మీడియా ముందు కూడా తీవ్ర ఆగ్రహావేశాలు ఎక్కువ. “మీ రేటింగ్ కోసం.. మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారా? “ అంటూ.. చిందులుతొక్కారు.
అయితే.. ఇప్పుడు… అదే సోము వీర్రాజుతో సహా రాష్ట్ర బీజేపీ నేతలంతా విశాఖ ఉక్కుపై పూర్తి ఆత్మరక్షణలో పడ్డారు. ‘‘వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదు. నాలుగు వ్యూహాత్మక రంగాలకు సంబంధించినవి మినహా… మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ విక్రయిస్తాం’’ అని ప్రధాని మోడీ తేల్చిచెప్పిన నేపథ్యంలో విశాఖ ఉక్కు.. సోము సహా బీజేపీ నేతల మెడలకు ఉరిబిగించింది.
ప్రధాని వ్యాఖ్యలను బట్టి.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపైనా వెనక్కి తగ్గేది లేదని పరోక్షంగా తేలిపోయింది. మరోవైపు… నీతి ఆయోగ్ ట్వీట్‌తో వెలుగులోకి వచ్చిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలకు భారీ ఎత్తున ఇంటా బయటా కూడా సెగ తగులుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలపై నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా రు. ఇంకెన్నాళ్లు అబద్ధాలు చెబుతారని నిలదీస్తున్నారు.
అమరావతి రాజధానిని నిలబెట్టడం, ప్రత్యేక హోదా ఇవ్వడం, విశాఖ రైల్వే జోన్ కేటాయింపుతో మొదలుకుని ఇప్పుడు విశాఖ ఉక్కుపైనా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. వీటికి సమాధానం చెప్పలేక.. మీడియా ముందుకు రాలేక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. నిజంగానే ఇప్పుడు చిందులు తొక్కతున్నారని అంటున్నారు పార్టీలోని కొందరు నాయకులు.