కిట్టీ పార్టీలతో పలువురు సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలను సోషలైట్ శిల్పా చౌదరి బురిడీ కొట్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ఇప్పటికే రెండు సార్లు పోలీసుల కస్టడీలో విచారణను ఎదుర్కొన్న శిల్పా చౌదరికి మరోసారి చుక్కెదురైంది. శిల్ప బెయిల్ పిటిషన్ విచారణను ఉప్పరపల్లి కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. అంతేకాదు, అప్పటిదాకా శిల్పా చౌదరిని చంచల్‌గూడ జైలుకు తరలించాలని 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
అయితే, కస్టడీలోకి తీసుకున్న తర్వాత శిల్పను పోలీసులు విచారణ జరిపారు. ఇందులో భాగంగానే ఆమెను నార్సింగి పోలీసులు కోకాపేట్‌లోని యాక్సిస్ బ్యాంక్‌కు తీసుకెళ్లారు. శిల్పాచౌదరి, ఆమె భర్త శ్రీనివాస్‌ప్రసాద్ సమక్షంలో శిల్ప లాకర్ తెరిచారు. అయితే, అందులో నగదు,నగలు, విలువైన ఆస్తి పత్రాలు ఏమీ లేకపోవడంతో పోలీసులు షాకయ్యారు. సొసైటీకి సంబంధించిన కొన్ని పత్రాలను పోలీసులు సీజ్ చేశారు. ఆ బ్యాంకులో శిల్ప ఖాతా లావాదేవీలను పరిశీలించారు. ఆమె ఖాతాలో కూడా డబ్బులు లేవు.
ఓ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంట్ మాత్రం లాకర్ లో దొరికినట్లు తెలుస్తోంది. ఇతరుల నుంచి తాను రూ.32కోట్లు తీసుకున్నట్లు శిల్పా చౌదరి పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ, బ్యాంకులో డబ్బు లేకపోవడంతో డబ్బంతా ఎక్కడ దాచారన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు, శిల్ప అరెస్టు కావడానికి ముందే జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. అంతేకాదు, రెండు సార్లు కస్టడీకి తీసుకున్నప్పటికీ….శిల్ప పోలీసులకు ఎలాంటి విలువైన సమాచారం ఇవ్వలేదు. మరి, మూడో సారి కస్టడీలోనైనా శిల్ప నోరు విప్పుతుందో లేదో వేచి చూడాలి.