హైదరాబాద్ లో ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దిశ ఉదంతం తర్వాత మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలపై మరింత అప్రమత్తమైన పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆటోడ్రైవర్ తనను కిడ్నాప్ చేసి స్నేహితులతో కలిసి బలవంతం చేయబోయాడని బాధితురాలు చెప్పడంతో ఆ ఆటోడ్రైవర్, అతడి స్నేహితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఈ సమయంలోనే ఈ వ్యవహారంలో అసలు గుట్టు రట్టు కావడంతో పోలీసులకు మైండ్ బ్లాక్ అయిందని తెలుస్తోంది. గ్యాంగ్ రేప్, కిడ్నాప్ నిజం కాదని, పోలీసులను ఆమె తప్పుదోవ పట్టించినట్టు తెలుస్తోంది. తన ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లిన యువతి…తన తల్లి పదే పదే ఫోన్ చేస్తుండటంతో ఈ డ్రామాకు తెర తీసిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆ యువతి కిడ్నాప్ డ్రామా ఆడడంతో… ఆమె తల్లి నిజమనుకొని పోలీసులకు ఫోన్ చేయడం…వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఆ యువతి స్నేహితులు పరారయ్యారని తెలుస్తోంది. పోలీసులు వస్తారని ఊహించని ఆ యువతి….కిడ్నాప్ డ్రామాను పోలీసుల దగ్గరా కొనసాగించినట్లు తెలుస్తోంది.
అయితే, రాంపల్లి సమీపంలో ఆటో దిగిన యువతి బైక్ ఎక్కి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజిలో పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యువతి తన తప్పును అంగీరించినట్టు సమాచారం. అయితే, దీనిపై పోలీసులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. విషయం రూఢీ అయిన తర్వాత పోలీసులు మీడియాముందుకు వచ్చి విషయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి.