ఆ నేతల కుటుంబాలను వైఎస్ఆర్ తొక్కేశారు...చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని, అందుకోసమే పార్టీ పెట్టే యోచనలో ఉన్నానని వైఎస్ షర్మిల చేసిన ప్రకటన రాజకీయంగా పెనుదుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ లోని రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపునకు తిప్పుకునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని, టీకాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేందుకు  యత్నిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దివంగత నేత వైఎస్ రాజ శేఖర్ రెడ్డిపై, ఏపీ సీఎం జగన్, షర్మిలలపై  కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతామోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.


కాంగ్రెస్‌ వల్ల ఉన్నత స్థాయికి వచ్చిన వైఎస్‌ కుటుంబీకులు ఇప్పుడు రాజన్న రాజ్యం పేరుతో చేస్తున్న హడావుడి పిల్ల చేష్టలుగా కనిపిస్తోందని చింతామోహన్‌ విమర్శించారు. వైఎస్సార్ ను రెండు సార్లు సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా చేసిన కాంగ్రెస్‌ పునాదులను ఆయన తొలగించారని, ఏ నేత చేయని విధంగా తన సొంత పలుకుబడిని పెంచుకుని  తన ఇద్దరు బిడ్డలు  వేల కోట్లు సంపాదించుకునేలా ఆర్థిక వనరులను సృష్టించారని షాకింగ్ కామెంట్లు చేశారు.


జేసీ దివాకర్‌ రెడ్డి, ఎంవీ మైసూరా రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, కాసు కృష్ణారెడ్డిలను వైఎస్సార్, జగన్ రాజకీయంగా దెబ్బతీశారని విమర్శించారు. కాంగ్రెస్‌ తెచ్చిన రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, అందరికీ ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకాలను తన సొంత పథకాలుగా వైఎస్ చిత్రీకరించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ పునాదులను తొలగించడమే రాజన్న రాజ్యమా అని షర్మిలనుద్దేశించి నిలదీశారు.

జగన్‌ పరిపాలనలో అవినీతి ఆకాశం ఎత్తుకు లేచిందని, ప్రతి ఫైల్‌కూ పైసలు వసూలు చేస్తున్నారని చింతా మోహన్ ఆరోపించారు. మైనింగ్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో వందల కోట్లు దండుకుటున్నారని విమర్శించారు. టీటీడీ ఆధీనంలోని రూ.10వేల కోట్ల డిపాజిట్లు, వందల కోట్ల బంగారు ఆభరణాలు, లక్షల కోట్ల ఆస్తులపై బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లు కన్నేశాయని చింతా మోహన్ ఆరోపించారు.


ఈ నెల 7న ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అధ్యక్షతన ఈ వ్యవహారంపై రహస్య సమావేశం జరిగిందని, లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్టు తెలిసిందని ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ తరహాలో టీటీడీని ధారాదత్తం చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్ బలహీనత వల్లే ఇదంతా జరుగుతోందని, ఇంతటి బలహీన సీఎంను తాను చూడలేదని అన్నారు. ఈ వ్యవహారాన్నంతటినీ తాను తాను కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఖండిస్తున్నానన్నారు. రాబోయే ప్రమాదాన్ని గుర్తించి అందరూ ఏక కంఠంతో వ్యతిరేకించాలని మోహన్‌ పిలుపునిచ్చారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.