ఏపీ ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పాలనను చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విశాఖకు ఐటీ దిగ్గజ కంపెనీ టిసిఎస్ రాబోతోంది. దాదాపు పదివేల మందికి ఉపాధి కల్పించేలాగా ఈ సంస్థను సముద్రతీర నగరమైన విశాఖలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో పర్యటించనున్న లోకేష్ మరిన్ని ఐటీ కంపెనీలను ఏపీకి తెచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.
తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ సంస్థ ఎన్విడియా సీఈవో హువాంగ్ తో లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పాలన వ్యవహారాల్లో వేగవంతమైన, మెరుగైన సేవలను అందించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగించాలని లోకేష్ భావిస్తున్నారు. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న ఏఐ యూనివర్సిటీకి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా లోకేష్ కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన హువాంగ్…రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా అంతర్జాతీయంగా విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని చెప్పారు.
మరోవైపు వేదాంత గ్రూప్ అనుబంధ సంస్థ సెరెంటికా గ్లోబల్ రెన్యువల్ ఎనర్జీ ప్రతినిధులతో కూడా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో 10 గిగావాట్ల రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం తమ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తుందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. 2030 నాటికి 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో కరెంటుగా సెరెంటికా గ్లోబల్ రెన్యువల్ ఎనర్జీ వంటి కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని లోకేష్ చెప్పారు. తద్వారా రాష్ట్రంలోని యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేష్ అన్నారు.