ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర లేదు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించగల డ్యాషింగ్ ఓపెనర్ వార్నర్. అయితే, మైదానం లోపల చూపించే దూకుడును వార్నర్ మైదానం వెలుపల కూడా చూపిస్తూ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుంటాడు. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో శిక్ష అనుభవించిన వార్నర్…ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి రాముడు మంచి బాలుడు అన్న రీతిలో ఉంటున్నాడు.
ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున 2021 సీజన్ వరకు ఆడిన వార్నర్…తెలుగు హీరోల పాటలకు స్టెప్పులేసి మరీ అభిమానులను ఫిదా చేశాడు. 2022 సీజన్ కు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న వార్నర్ పై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2009 ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో వార్నర్ తో కలిసి ఆడిన సెహ్వాగ్ ఆనాటి ఘటనల గురించి షాకింగ్ కామెంట్లు చేశాడు.
తొలి ఐపీఎల్ సీజన్ లో తన సహ ఆటగాడు వార్నర్ కు క్రమశిక్షణ అన్నదే లేదని వీరూ అన్నాడు. డ్రెస్సింగ్ రూంలో అతడి ప్రవర్తన అస్సలు బాగుండేది కాదని, వార్నర్ తో పాటు మరో ఆటగాడిపై తాను కోప్పడ్డానని గుర్తు చేసుకున్నాడు. ప్రాక్టీస్, మ్యాచ్ లకన్నా పార్టీలకే వార్నర్ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడని చెప్పుకొచ్చాడు. తొలి సీజన్ లోనే తోటి ఆటగాళ్లతో ఎప్పుడూ గొడవ పెట్టుకునేవాడని, దీంతో ఆ సీజన్ ఇంకా రెండు మ్యాచ్ లు ఉండగానే అతడిని పంపించేశామని షాకింగ్ కామెంట్లు చేశాడు.
హద్దులు లేనివాళ్లకు గుణపాఠం నేర్పాలంటే అప్పుడప్పుడు ఇలా బయటకు పంపించేయాల్సి ఉంటుందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. జట్టుకు అతడొక్కడే ముఖ్యం కాదని, ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారని అన్నాడు. అతడు లేకుండా కూడా ఢిల్లీ గెలిచిన సందర్భాలున్నాయని చెప్పాడు. హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందు వార్నర్ వ్యవహారం చర్చకు రావడంతో వీరూ ఈ కామెంట్లు చేశాడు.