నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు…సీఐడీ కస్టడీలో ఆయనకు గాయాలయ్యాయన్న ఆరోపణలపై సుప్రీం కోర్టు విచారణ…అనంతరం రఘురామకు బెయిల్ వంటి వ్యవహారాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రఘురామపై రాజద్రోహం 124 ఏ, మత వైషమ్యాలను రెచ్చగొట్టడం 153 ఏ .. హింసను ప్రేరేపించే మాటలు చెప్పే నేరం 505 బి వంటి పలు సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో సెక్షన్ 124 ఏపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తెల్లదొరల హయాంలో స్వాతంత్రసమరయోధులను అణగదొక్కి జైల్లో మగ్గేలా చేయడానికి రూపొందించిన ఆ చట్టం…స్వతంత్ర భారతావనిలో ఇంకా అమలు కావడంపై చర్చ జరుగుతోంది. ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు.. ఆ ప్రజలు ప్రశ్నిస్తే మాత్రం సహించలేక ఈ రాజద్రోహం కేసులు పెడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
ఏదైనా దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించే తీవ్రవాద కార్యకలాపాలు మాత్రమే రాజ్య ద్రోహం కిందకు వస్తాయి…కానీ రాజద్రోహంక కిందకు రావని పాలకులు గుర్తించడం లేదు. ప్రభుత్వంలోని లోపాలను విమర్శించడం, ప్రధాన మంత్రిని, ముఖ్యమంత్రిని విమర్శించడం రాజద్రోహమే అనడం అవివేకమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విధానాలను ఎందుకు విమర్శించ కూడదు? అసలు రాజే లేనప్పుడు రాజద్రోహం ఎక్కడుంటుంది అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అయితే, ఏపీ సర్కార్ తో పాటు కేంద్రం ప్రభుత్వం కూడా కొందరిపై రాజద్రోహం కేసులు నమోదు చేసింది. ఈ సెక్షన్ క్రింద వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే సౌకర్యం ఉండడం, తక్షణం బెయిల్ ఇవ్వాల్సిన పనిలేకపోవడం, ప్రాథమిక ఆధారాలు చూపకుండానే కేసు నమోదు చేసే సౌలభ్యం ఉండడం, దర్యాప్తును కొన సా…గిస్తూ కోర్టు విచారణలో జాప్యం చేసే వెసులుబాటు ఉండడం ఈ సెక్షన్ కు ఉండే సౌలభ్యం.
కేవలం తమ ప్రత్యర్ధులు బెయిల్ కూడా పొందకుండా జైల్లో పెట్టి కక్ష తీర్చుకోవడానికి రాజద్రోహం కేసును మోపుతున్నరనేది నిర్వివాదాంశం. దేశంలోని 70 శాతం కేసుల్లో ఇదే కఠోర వాస్తవం. హింసాకాండను రెచ్చగొట్టాలనే ఉద్దేశ్యం ఉండటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అందువల్ల ప్రజలు రెచ్చిపోవడం జరిగితే తప్ప రాజద్రోహం కాదని సుప్రీం కోర్టు 1995 మార్చి 1న తీర్పు ఇచ్చింది.
కానీ, క్రైస్తవులకు, రెడ్డి సామాజిక వర్గంపై రఘురామ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కుల వైషమ్యాలకు తెరతీశారని రాజద్రోహం సెక్షన్లు మోపి అరెస్ట్ చేసే క్రమంలో సుప్రీం ఆదేశాలు పట్టించుకోలేదు. ఆ మాటకొస్తే చాలామంది ప్రభుత్వ పెద్దల తీవ్రమైన బాష , అసభ్య పదజాలం, కుల వైషమ్యాలను రెచ్చగొట్టే వ్యాఖ్యల ఆధారంగా వారిపై ఈ సెక్షన్ల క్రింద చర్య తీసుకోవచ్చు. మరి అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ తరహాలో రాజద్రోహం సెక్షన్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ సెక్షన్ ల విషయంలో సుప్రీం కోర్టు మరింత స్పష్టమైన మార్గదర్శాలు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సెక్షన్ల దుర్వినియోగంపై ప్రజాస్వామ్యవాదులు కూడా స్పందించాల్సిన ఆవశ్యకత ఉంది.
ఎందుకంటే, నేడు రఘురామ…రేపు ఇంకోపార్టీ నేత…ఎల్లుండి మరో ప్రజాస్వామ్యవాది…ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం అంటే…చివరకు ఏపీలో, దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ కరువై నియంతృత్వం రాజ్యమేలుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. జగన్ లాంటి నియంతలకు సెక్షన్ 124A…పిచ్చోడి చేతిలో రాయి ఒకటేనా? ఆయుధంగా మారిందా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు సంధిస్తున్న భేతాళ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.