ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 12:30 వరకు 64.75 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో 13 జిల్లాల్లో ఏకగ్రీవాలు పోను 2,786 సర్పంచ్ స్థానాలకు, 20,817 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ మాదిరిగానే రెండో దశ పోలింగ్ సందర్భంగానూ వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
నరసరావుపేట నియోజకవర్గంలో అధికార పార్టీ ఎన్నో ఆటంకాలు సృష్టించిందని టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుపడ్డారని, ఈ రోజు పోలింగ్ కేంద్రాలకు రాకుండా రాత్రంతా బెదిరిస్తూనే ఉన్నారని ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో అల్లర్లు చేయడానికి వైసీపీ శ్రేణులు కుట్ర పన్నాయని ఆరోపించారు.
విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలం విక్రమపురంలో అధికార పార్టీ నేతలు జులుంను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనిమెళ్లలో అలజడి చోటు చేసుకుంది. 7వ వార్డు పోలింగ్ బూత్‌లో ప్రజల నుంచి ఓటరు స్లిప్‌లు లాక్కొని తానే ఓట్లు వేసేందుకు ఓ ఏజెంట్ ప్రయత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీఎం జగన్ సొంత జిల్లా అయిన వైఎస్సార్ కడప జిల్లాలో కమలాపురం మండలం పెద్దచెప్పలి గ్రామంలో ఓటర్లకు స్లిప్పులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో గందరగోళం ఏర్పడింది. ఎన్నికలు ఆపాలంటూ గ్రామస్థులు నిరసనకు దిగారు. 2019 ఓటర్ లిస్టు ప్రకారం ఎన్నికలు జరపాలని టీడీపీ మద్దతుదారులు డిమాండ్ చేశారు. 196 కొత్త ఓట్లు చేర్చటంపై అభ్యంతరం తెలిపారు.
నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం పోతేగుంటలో వాలంటీర్ రమేష్ బెదిరింపులకు దిగాడు. వైసీపీ మద్దతుదారులకు ఓటు వేయకపోతే పింఛన్లు ఆపేస్తామంటూ ఓటర్లపై బెదిరింపులకు పాల్పడ్డాడు. తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల విధుల్లో ఉన్న వీఆర్ఏ నరసింహులుకు ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.