పేరుకు తమిళ అమ్మాయే అయినా.. తెలుగులోనే తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించి ఇక్కడ పెద్ద హీరోయిన్గా ఎదిగింది సమంత. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా చాలామంది టాప్ స్టార్లతో ఆమె సినిమాలు చేసింది. ఒక దశాబ్దం పాటు పెద్ద సినిమాలు టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగిన సామ్.. గత కొన్నేళ్లలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే.
గత ఏడాది ‘యశోద’తో మంచి ఫలితమే అందుకున్న సామ్.. ఈ ఏడాది ‘శాకుంతలం’తో షాక్ తింది. మధ్యలో ఆమెను అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ.. తర్వాత కోలుకుని ‘ఖుషి’ సినిమాను పూర్తి చేసింది. అలాగే హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’లోనూ నటిస్తోంది. మళ్లీ బిజీ అవుతున్నట్లు కనిపించిన సామ్.. ఇప్పుడు నటనకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.
‘శాకుంతలం’ ప్రమోషన్లలో చూస్తే సమంత మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకుందా లేదా అన్న సందేహాలు కలిగాయి. ఆమె డల్లుగానే కనిపించింది అందులో. ఆ తర్వాత షూటింగ్‌లకు వెళ్తోందంటే అంతా బాగానే ఉందనుకున్నారంతా. కానీ సమంత సన్నిహిత వర్గాల ప్రకారం.. అనారోగ్యం వల్ల సమంత పూర్తి స్థాయిలో పని చేయలేకపోతోందట. కష్టపడి ‘ఖుషి’ని పూర్తి చేసిన సామ్.. త్వరలోనే ‘సిటాడెల్’కు సంబంధించి కూడా తన వర్క్ ఫినిష్ చేసి బ్రేక్ తీసుకోవాలనుకుంటోందట.
ఆమె విదేశాలకు వెళ్లి అక్కడే రిహాబిలిటేషన్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం కనీసం ఆరు నెలలు అయినా సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని సమాచారం. ఐతే ఇప్పటికే సామ్ కెరీర్ చరమాంకంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ‘శాకుంతలం’ ఫలితం చూశాక ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే విషయంలోనూ ఫిలిం మేకర్స్ పునరాలోచనలో పడ్డారు. సామ్ ఇలా బ్రేక్ తీసుకుందంటే లైమ్ లైట్‌కు దూరమై కెరీర్ క్లోజ్ అయిపోయే ప్రమాదం ఉంది.