బుధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఘోరం జరిగిపోయింది.
నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబును చూసేందుకు వచ్చిన తెలుగుదేశం కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఎనిమిది మంది ప్రాణాలు వదలడం ఆ పార్టీలో విషాద ఛాయలను నింపింది.
పార్టీలకు అతీతంగా అందరినీ బాధించే విషయమిది. ఆ ఎనిమిది మంది కుటుంబాలు ఎంతటి శోకంలో మునిగిపోయి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇలాంటి విషాదాలు చోటు చేసుకున్నపుడు కూడా రాజకీయ కోణంలో చూస్తే.. దీన్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవాలని చూస్తే అంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి లేదు.
ఇలాంటి సున్నితమైన విషయంలో మీడియా కూడా రాజకీయ కోణం పక్కన పెట్టి విషయాన్ని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
కానీ సాక్షి పత్రిక మాత్రం ఈ ఉదంతానికి సంబంధించిన వార్తకు దారుణమైన హెడ్డింగ్ పెట్టింది.
‘షో’క సంద్రం.. ఇదీ ఈ వార్తకు సాక్షి పెట్టిన శీర్షిక. ఇలాంటి విషాదభరిత వార్తకు కాస్తయినా విచక్షణ లేకుండా ఇలాంటి హెడ్డింగ్ పెట్టిన వారిని ఏమనాలి?
చంద్రబాబు నాయుడు రోడ్ ‘షో’ చేసిన ఫలితంగానే ఈ విషాదం చోటు చేసుకుందని, దీనికి ఆయనే బాధ్యత అని చెప్పకనే చెబుతున్నట్లయింది.
మరి ప్రతిపక్ష నేత చేస్తున్న రోడ్ షోకు సరైన భద్రత ఏర్పాట్లు చేయని ప్రభుత్వ వైఫల్యం మాటేంటి అన్నది ప్రశ్న.
ఈ వార్తను ప్రెజెంట్ చేసిన విధానం అంతా కూడా చంద్రబాబును విలన్ని చేసే ప్రయత్నంలాగే కనిపించింది.
చంద్రబాబు అధికారంలో ఉండగా జరిగిన గోదావరి పుష్కరాల విషాదంతో దీన్ని పోలుస్తూ వైకాపా మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.
మరి ఇప్పుడు అధికారంలో ఉన్నది జగన్ ప్రభుత్వం కదా.. జరిగిన ఘోరానికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా అనే లాజిక్ మరిచిపోతున్నారు.
ఇలాంటి సున్నితమైన, విషాదభరిత ఘటనల్లో కూడా రాజకీయాలు చేసి ప్రయోజనాలు పొందాలని చూడడం ఎంత దారుణం?