దేశవ్యాప్తంగానే కాక ప్రపంచ స్థాయిలో భారీ స్థాయిలో అభిమానగణం ఉన్న క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని. సచిన్ తర్వాత ఆ స్థాయిలో అభిమానం సంపాదించుకున్నాడతను. అలాంటి వ్యక్తి భార్యకు అభిమాన హీరో మన అల్లు అర్జున్ అట. అవును.. ధోని సతీమణి సాక్షి బన్నీకి చాలా పెద్ద ఫ్యాన్ అట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. ధోని ప్రొడక్షన్లో తమిళంలో ఎల్.జి.ఎం (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రం ఈ నెల 28న తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సాక్షి హైదరాబాద్కు చిత్ర బృందంతో కలిసి విచ్చేసింది. ఈ సందర్భంగా తెలుగులో మీ అభిమాన కథానాయకుడెవరు అని విలేకరులు అడగ్గా.. అల్లు అర్జున్ పేరు చెప్పింది సాక్షి.
బన్నీకి తాను ఎప్పట్నుంచో పెద్ద ఫ్యాన్ అని.. యూట్యూబ్లో ఆయన సినిమాలు చాలా ఏళ్ల నుంచి చూస్తున్నానని ఆమె వెల్లడించింది. మరోవైపు తెలుగులో ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు తీస్తారా అని విలేకరులు అడగ్గా.. ఇప్పుడే అంతదాకా ఆలోచించలేదని చెప్పింది సాక్షి. ఇప్పుడే నిర్మాతగా తన ప్రయాణం మొదలైందని.. తెలుగులో కచ్చితంగా సినిమాలు నిర్మిస్తానని.. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి పెద్ద స్టార్లతో సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని తనకూ ఉందని, భవిష్యత్తులో ఆ ప్రయత్నం చేస్తానని ఆమె పేర్కొంది.
ఎల్.జి.ఎం సినిమా విషయానికి వస్తే హరీష్ కళ్యాణ్, ఇవానా ఇందులో జంటగా నటించారు. రమేష్ తమిళ్మణి ఈ ఈ యూత్ ఫుల్ మూవీకి దర్శకత్వం వహించాడు. నదియా ఇందులో ముఖ్య పాత్ర పోషించింది. పవన్ కళ్యాణ్ సినిమా బ్రోకు పోటీగా రిలీజవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏమేర పట్టించుకుంటారో చూడాలి.