ఇప్పటి రాజకీయం ఎంత కరకుగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతానికి భిన్నంగా ఇప్పుడు రాజకీయం వ్యక్తిగత వైరానికి మించిన స్థాయికి చేరుకుంది. పవర్లోకి రావటం ఆలస్యం.. ప్రత్యర్థులపై విరుచుకుపడటం.. వారి ఆర్థిక మూలాల్ని దారుణంగా దెబ్బ తీయటం.. కోలుకోకుండా చేయటం.. ఒకవేళ ఈ దెబ్బలకు ప్రతిఘటిస్తే పోలీసు కేసులు పెట్టి మూయించటం.. లాంటివి తరచూ జరుగుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఒక సాదాసీదా ఎమ్మెల్యే వరకు చెప్పే మాటేమంటే.. రాజకీయ వైరం ఎన్నికల వరకే.. ఒకసారి ఎన్నికలయ్యాక అంతా ప్రజా శ్రేయస్సే అని చెబుతారు.
కానీ.. వాస్తవంలో జరుగుతున్నది మాత్రం అందుకు భిన్నం. అయితే.. తోపు నేతలు కూడా చేయని పనిని ఒక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గెలిచిన అభ్యర్థితో పాటు ఆ ఊరు వారు చేసిన పని ఇప్పుడు అందరూ మాట్లాడుకునేలా చేసింది.
హర్యానాలోని రోహ్ తక్ ప్రాంతంలోజరిగిన ఒక సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు కొత్త రాజకీయానికి తెర తీసేలా చేసింది. ఇంతకూ జరిగిందేమంటే.. రోహ్ తక్ జిల్లాలోని చిది గ్రామంలో ఇటీవల సర్పంచ్ ఎన్నిక జరిగింది. పోటాపోటీగా సాగిన ఈ ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు.
అత్యంత సున్నితమైన ఈ పంచాయితీ ఎన్నికల్లో నవీన్ దలాల్ అనే అభ్యర్థి చేతిలో ధర్మపాల్ దలాల్ 66 ఓట్ల స్వల్ప వ్యత్యాసంతో ఓడారు. ఎన్నికల ఫలితం వచ్చాక ఊళ్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అన్న సందేహం వ్యక్తమైంది. ఇలాంటి వేళ.. గెలిచిన అభ్యర్థితో పాటు.. ఊరి ప్రజలు అంతా కలిసి ఆలోచించి.. ఓడిన ధర్మపాల్ కు రూ.2.11 కోట్ల విలువైన ఖరీదైన కారును బహుమానంగా అందజేయాలని నిర్ణయించారు.
ఓటమి వేదనతో ఉన్న ధర్మపాల్ కు ఊరి వారంతా కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ఆనందాన్ని కలిగించింది. ఓడి గెలిస్తే అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది? రాజకీయ విద్వేషాల్లో ఊరు రగిలిపోకుండా ఉండేందుకు.. ముందుచూపుతో వ్యవహరించిన గ్రామస్తుల్ని అభినందించాల్సిందే.