దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తన పర…భేదం లేని కరోనా…సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరినో బలితీసుకుంది. కరోనా బారిన పడి ఇప్పటికే పలువురు ప్రముఖులు కన్నుమూశారు. తాజాగా ఆ జాబితాలో భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు, రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్(82) కన్నుమూశారు.
కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న అజిత్ సింగ్ పరిస్థితి విషమించడంతో నేడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యుడిగానూ పని చేసిన అజిత్ సింగ్…యూపీఏ హయాంలో పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అజిత్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీపాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
అజిత్ సింగ్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యునిగా, కేంద్రమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలందించారని, ప్రజల కోసం పరితపించిన నాయకుడని చంద్రబాబు కొనియాడారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలు రైతులకు ఎంతగానో ఉపయోగ పడ్డాయన్నారు. అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అజిత్ సింగ్ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరోవైపు, ఎన్ఎస్ జీ కోఆర్డినేషన్ గ్రూప్ కమాండర్ బీకే ఝా (53) కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్న వెంటిలేటర్ పనిచేయకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. వెంటిలేటర్ బెడ్ ఉన్న మరో ఆసుపత్రిలో బెడ్ దొరికి… తరలించేందుకు కార్డియాక్ అంబులెన్స్ దొరికే సరికి ఆలస్యం కావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
కాగా, ట్రిపుల్ తలాఖ్ వంటి పలు కీలకమైన బిల్లుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన కేంద్ర న్యాయశాఖ (శాసన) కార్యదర్శి డాక్టర్ జి.నారాయణరాజు కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. కొవిడ్ బారినపడి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణరాజు పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. నెల్లూరు జిల్లాలోని కావలి నారాయణ రాజు స్వస్థలం.