తెలుగు మీడియా రంగంలో అధినేతలు ఎంతమంది ఉన్నా.. ఇద్దరి చుట్టూనే ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది. అందులో మొదటి వ్యక్తి ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు అయితే.. రెండో వ్యక్తి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల అధినేత వేమూరి రాధాక్రిష్ణగా చెప్పాలి.
రామోజీ తీరుతో పోలిస్తే ఆంధ్రజ్యోతి ఆర్కే ఒకింత దూకుడుగా వ్యవహరిస్తారని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాల్లో ఆయన చర్చ ఎప్పుడూ ఏదో ఒక మూల జరుగుతూనే ఉంటుంది.
అలాంటి ఆర్కే తాజాగా బిగ్ డిబేట్ పేరుతో తన చానల్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితతో ఇంటర్వ్యూ నిర్వహించారు. లైవ్ లో సాగిన ఈ చర్చ అందరిని ఆకర్షించింది.
దీనికి కారణం లేకపోలేదు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె మీద ఆరోపణలు రావటం.. దీనిపై న్యాయస్థానాన్ని సంప్రదించిన నేపథ్యంలో ఆమెపై ఎలాంటి ఆరోపణలు.. తీవ్రమైన వ్యాఖ్యలు చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ కవితతో ఆయన లైవ్ లో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు.
దాదాపు గంటా పదిహేను నిమిషాల పాటు సాగిన ఈ లైవ్ ఇంటర్వ్యూలో విశేషాలకు కొదవ లేదు. మోడీ మీద తమకున్న వ్యతిరేకతను ఏ మాత్రం దాచుకోని ఆమె.. బీజేపీ అధినాయకత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు చేశారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇంటర్వ్యూలో భాగంగా ఆర్కే మీదా కాస్తంత ఘాటుదనంతో కూడిన నిష్ఠూరాన్ని ఆడేసే విషయంలో అస్సలు వెనుకాడలేదు కవిత. ఇంటర్వ్యూలో భాగంగా ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి చర్చ జరిగే వేళలో.. ఈ ఉదంతంపై కుమార్తెపై సీఎం కేసీఆర్ ఆగ్రహాం వ్యక్తం చేశారంటూ పత్రికలో వార్త వేయటాన్ని ఆమె ప్రశ్నించారు. ఒక గదిలో తాను.. తన తండ్రి మాట్లాడుకున్న అంశం వేరే అయితే దానికి ఇలాంటి భాష్యం ఎలా చెబుతారన్న ఆమె..
‘అంకుల్.. మీకు ఎవరు చెప్పారు? వారు చెప్పింది తప్పు. నాన్న ఏమీ అనలేదు. మీరెలా రాస్తారు? మీరు అక్కడ లేరు కదా? నా వివరణ తీసుకోకుండా ఎలా ప్రచురిస్తారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు.. సీఎంలో మీకు అలా తప్పుడు సమాచారం ఇచ్చే వారి పేర్లు చెప్పండి. వారిని పీకించేద్దాం’ అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
తాను ఇంటర్వ్యూ చేసే వారిపైన పట్టును ప్రదర్శించే ఆర్కే.. తాజా ఇంటర్వ్యూలో మాత్రం కాస్తంత తగ్గినట్లుగా ఆయన తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. ఎంత ధైర్యం లేకపోతే.. ఆర్కేను ప్రశ్నించటమే కాదు.. ఆయన సోర్సును చెప్పే ప్రయత్నం చేయమని చెప్పటం గమనార్హం.
కవిత వ్యాఖ్యలకు ఒక మోస్తరు గా మాత్రమే స్పందించిన ఆర్కే వైనం ఆసక్తికరంగా మారితే.. ఇదేం జర్నలిజం అన్నట్లుగా కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఏమైనా ఆర్కేను ముఖం మీదనే అడిగే దమ్ము తన సొంతమన్న విషయాన్ని కవిత మరోసారి ఫ్రూవ్ చేసిందని చెప్పాలి.