అమెరికాలోని న్యూయార్క్‌లో భారీ రగడ చోటు చేసుకుంది. వేలాదిగా గుమిగూడిన ఓ ట్యూబర్ అభిమానులు .. తోపులాటకు దిగడం.. ఒకరిపై ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడడం, బాటిళ్లు విరుసుకోవడంతో భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో ట్యూబర్ సహా.. పలువురు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు.
ఏం జరిగిందంటే..
ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ కై సీనట్.. తన అభిమానుల కోసం ఓపెన్ ప్రోగ్రాం ప్లాన్ చేశాడు. న్యూయార్క్‌లోని అత్యంత రద్దీగా ఉండే మన్హటన్ యూనియన్ స్వ్కేర్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అసలే కై సీనట్ అంటే.. పడిచచ్చే అభిమానులు.. నేరుగా ఆయనతో కలిసి పాల్గొనేందుకు.. ఉత్సాహం చూపించారు. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఆయన గొప్ప ఆఫర్ కూడా ప్రకటించాడు. వీటిలో ప్లే స్టేషన్ 5 గేమ్ కన్సోల్స్ సహా పలు గిఫ్ట్‌లు ఉన్నాయి.
దీంతో ఆ ప్రాంతానికి సీనట్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. సుమారు 2 వేలకు పైగా రావడంతో న్యూయార్క్ ప్రధాన వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. అయితే, ముందస్తు అనుమతులు లేకపోవడంతో పోలీసులు వీరిని అదుపుచేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా సీనట్ అభిమానుల్లో కొందరు అల్లర్లకు పాల్పడ్డారు. ఒకరినొకరు తోసుకోవడం, బాటిళ్లు విసరడం, కార్లను ధ్వంసం చేయడం వంటివి చేశారు.
కొందరు అక్కడున్న భవనాలపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ ఘర్షణల్లో పోలీసు అధికారుల సహా పలువురు గాయపడ్డారు. ఉద్రిక్తతలు తీవ్రమవడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అటు, భద్రతా కారణాల దృష్ట్యా సీనట్‌ను కూడా పోలీసులు అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించారు. అనంతరం అతనిని అరెస్టు కూడా చేశారు. 21 ఏళ్ల సీనట్ ఓ పాపులర్ వీడియో క్రియేటర్. ట్విచ్ అనే లైవ్‌స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో అతడికి 65లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.