బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాలలో సైతం చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్న సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షాకిచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పేరు మార్పు చెల్లదంటూ ఢిల్లీ హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేస్తూ. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టారు. ఈ క్రమంలోనే నేడు ఆ పిటిషన్ పై కోర్టులో విచారణ జరగబోతోంది.
2017లో బంగారు కూలీ పేరుతో టీఆర్ఎస్ నేతలు వసూళ్లకు పాల్పడిన అంశంపై ఆల్రెడీ ఢిల్లీ హైకేర్టులో ఆ కేసు విచారణలో ఉందని రేవంత్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని 2018లో ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశాలిచ్చిందని చెప్పారు. కానీ, ఆ దిశగా ఈసీ చర్యలేవీ తీసుకోలేదని అన్నారు. ఆ కేసు విచారణలో ఉండగా పార్టీ పేరును మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసేందుకు 5 సార్లు ప్రయత్నించానని, కానీ, తనకు అపాయింట్మెంట్ దొరకలేదని రేవంత్ ఆరోపిస్తున్నారు. చివరకు, రాష్ట్రపతి, పీఎం, హోం మంత్రికి ఆన్ లైన్లో ఫిర్యాదు చేశానని చెప్పారు. దీంతో, ఈ అంశంపై ఈ నెల 6న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్టు రేవంత్ చెప్పారు. కోర్టు విచారణలో ఉన్న అంశాన్ని పక్కన పెట్టి పార్టీ పేరు మార్పు ప్రక్రియను చేపట్టడం సరికాదని చెప్పారు.
బీజేపీ సూచనల ప్రకారమే టీఆర్ఎస్ కు ఈసీ సహకరిస్తోందని రేవంత్ ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ లు పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. దక్షిణ భారతంలో బీఆర్ఎస్ ను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆప్, ఎంఐఎంలు ఉత్తర భారతంలో ఓట్లను చీల్చడానికి ఉపయోగపడుతున్నాయన్నారు.