ఘాటు వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా కేసీఆర్ తీరుపైనా… ఆయన ప్రభుత్వ విధానాల మీద ఘాటుగా రియాక్టు అయ్యారు. తాజాగా ఆయన నిర్వహిస్తున్న పాదయాత్రలో కేసీఆర్ కుటుంబ పాలన గురించి విమర్శల్ని సంధించారు. తన కుటుంబ సభ్యులకు.. బంధువుల విషయంలో కేసీఆర్ వైఖరి ఎలా ఉంటుంది? మిగిలిన సామాన్యుల విషయంలో మరెలా ఉంటుందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించటం తెలిసిందే. తాజాగా అలాంటి ప్రయత్నమే మరొకటి చేశారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అండగా నిలిచే విషయంలో సొంతోళ్ల విషయంలో ఒకలా వ్యవహరించే కేసీఆర్.. తన బంధువుల విషయంలో మాత్రం మరోలా వ్యవహరిస్తారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఇదే విషయాన్ని ఆయన తన పాదయాత్రలో ప్రస్తావించారు. ‘‘మిడ్ మానేరు.. గౌరవెల్లి రిజర్వాయర్ పనుల్లో భాగంగా భూములు కోల్పోయిన వారి విషయంలో సడ్డకుడి బిడ్డకు ఒక న్యాయం.. గిరిజన పేద ఆడబిడ్డలకు మరో న్యాయమా?’’ అని మండిపడ్డారు.
మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్మాణంలో కేసీఆర్ బంధువు జోగినపల్లి రవీందర్ రావు భూములు కోల్పోయారని.. ఆయన కొడుకు సంతోష్ రావు.. కుమార్తె సౌజన్యకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ.. ప్లాటు ఇచ్చారన్నారు. ‘మరి గౌరవెల్లి రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన వారి ఆడబిడ్డలకు మరో న్యాయమా?’’ అని క్వశ్చన్ చేవారు. సడ్డకుడి బిడ్డకు ఒక న్యాయం.. గిరిజన పేద ఆడబిడ్డలకు మరో న్యాయమా? అని సూటిగా ప్రశ్నను సంధించారు.
హరీశ్ రావు కుట్రలో భాగమే హుస్నాబాద్ ను మూడు ముక్కలు చేశారంటూ సంచలన వ్యాఖ్యలుచేసిన రేవంత్ రెడ్డి.. ఒక పారిశ్రామికవేత్త కోసమే తోటపల్లి రిజర్వాయర్ ను రద్దు చేశారని ఆరోపించారు. మరి.. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కాని.. మంత్రి కేటీఆర్ కానీ స్పందిస్తారా? వివరణ ఇస్తారా? అన్నది తేలాల్సిన ప్రశ్న.