తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి మంచి దూకుడుగా వెళుతున్నారు. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని కీలక నేత కౌశిక్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరించారు.
ఇదే సందర్భంలో రేవంత్ పార్టీ అధ్యక్షుడైన కారణంగానే తాము కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయినట్లు నలుగురు నేతలు బహిరంగంగా ప్రకటించారు. అంటే ఒకటి మైనస్ అయితే నాలుగు ప్లస్సులన్నమాట.
హుజూరాబాద్ ఉపఎన్నిక నేపధ్యంలోనే కౌశిక్ ను పార్టీ నుండి బహిష్కరించినట్లు రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రేవంత్ వల్లే కాంగ్రెస్ లోకి వస్తున్నదెవరంటే మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, జడ్చర్ల మాజీ ఎంఎల్ఏ ఎర్ర శేఖర్, సీనియర్ నేత గండ్ర సత్యనారాయణ ప్రకటించారు. సంజయ్ అంటే పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ కొడుకు, నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ సోదరుడున్న విషయం తెలిసిందే.
పై నలుగురిలో కొండా కాంగ్రెస్ పార్టీలో చేరి వెంటనే బయటకు వచ్చేశారు. అయితే రేవంత్ తో కొండా తాజాగా భేటీ అయ్యారు. తొందరలోనే కాంగ్రెస్ లో చేరటానికి అంగీకరించారట. ఇక సంజయ్ ఏమో టీఆర్ఎస్ నేత. శేఖరేమో బీజేపీలో ఉన్నారు. సంజయ్, శేఖర్ కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ చేసుకున్న కారణంగా పై రెండు పార్టీలకు ఎంతో కొంత నష్టం జరిగేదే.
రేవంత్ కు పార్టీ పగ్గాలు అప్పగించగానే కాంగ్రెస్ లో నుండి బీజేపీలోకి వెళ్ళిన నేతల్లో కొందరు తిరిగి హస్తం గూటికే వస్తారని అంచనా వేశారు. అలాగే టీఆర్ఎస్ లోని అసంతృప్తుల్లో కొందరు కాంగ్రెస్ వైపుకు వచ్చేస్తారని అంచనా వేశారు.
టీఆర్ఎస్ నుండి వస్తారని అనుకున్న నేతల విషయాన్ని పక్కనపెట్టేస్తే బీజేపీ నుండి మరికొందరు నేతలు తిరిగి వచ్చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సంజయ్ కూడా టీఆర్ఎస్ నుండి ఎందుకు వచ్చేస్తున్నారంటే తన తండ్రి డీఎస్ పరిస్ధితి అక్కడేమీ బావోలేదు.
డీఎస్ అసలు టీఆర్ఎస్ లో ఉన్నారో లేదో కూడా చాలామందికి తెలీదు. కాబట్టి సంజయ్ కాంగ్రెస్ లో చేరటంలో ఆశ్చర్యమేమీలేదు. మొత్తానికి ఇతర పార్టీల నుండి నేతలను కాంగ్రెస్ లోకి ఆకర్షించటంలో రేవంత్ బోణి బాగానే ఉన్నట్లే.