మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి అదిరిపోయే సవాల్ విసిరారు. తన ఆస్తులు.. కేటీఆర్ ఆస్తులపై విచారణకు తాను సిద్ధమని.. మరి కేటీఆర్ కూడా సిద్ధమేనా? అని ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటే.. సిట్టింగ్ జడ్జితో ఆస్తులపై విచారణ చేయించాలని సవాల్ రువ్వారు. `హాత్ సే హాత్ జోడో ` యాత్రలో భాగంగా రేవంత్ మాట్లాడుతూ.. కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భూ దందా విషయంలో తన ఆస్తులు, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రేవంత్ చేసిన ఆరోపణలు ఇవే..
+ రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో త్రిపుల్ వన్ జీవో నుంచి వెయ్యి ఎకరాలను మినహాయించిన మంత్రి కేటీఆర్.. రూ.5 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని అన్నారు.
+ ఈపీఆర్ఆర్ఐ, జవహర్ కమిటీ నివేదికలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
+ విద్యుత్ ఛార్జీల పేరిట పేదలను బీఆర్ఎస్ సర్కార్ ఇబ్బందులు పెడుతోందని రేవంత్ విమర్శించారు. ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, గోపాల్‌రావు వల్లే విద్యుత్ సంస్థలు అప్పుల్లో మునిగాయని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వీరంతా ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించారు.
+ అత్యంత కీలకమైన భూ వ్యవహారాలను నిర్వహించే ధరణి పోర్టల్‌ను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
+ వట్టినాగుల పల్లెలో 1000 ఎకరాలకు సంబంధించి జీవో నెం 111 నుంచి మినహాయింపు పొందారు.
+ ప్రభుత్వం తప్పుడు అపడఫిట్ దాఖలు చేసి.. కోర్టును తప్పుదోవ పట్టించి ఆ 1000 ఎకరాలను 111 జీవో నుంచి మినహాయింపు తీసుకున్నారు.
+ అందులో ఉన్న రాజులు, రావులు ఎవరు..? తద్వారా లబ్ధిదారులు ఎవరు?
+ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణ ఎదుర్కొంటున్న అరుణ్ పిళ్లై భూమిని ఈడీ సీజ్ చేసింది. ఈ భూమి అనేది అందులోనిది కాదా.. దాదాపు రూ.4000 నుంచి రూ.5000 కోట్ల కుంభకోణానికి కేటీఆర్ పూనుకున్నారు.