ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నోరు అదుపులో పెట్టుకో అంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వార్నింగ్ ఇచ్చారు. ఏబీ వెంకటేశ్వరరావు అంటే తెలియని వారుండరు. 2019 ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి రాగానే వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. కక్షపూరితంగా సస్పెండ్ చేసి వేధిస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వం పై ఏబీవీ ధిక్కార స్వరం వినిపించారు. ఉద్యోగం కోసం న్యాయపోరాటానికి దిగారు.
ఐదేళ్లు సస్పెన్షన్‌లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఫైనల్ గా నాటి ప్రభుత్వంపై గెలిచారు. రిటైర్డ్ అయ్యే రోజు బాధ్యతలు చేపట్టి, సాయంత్రం పదవీ విరమణ పొందిన అధికారిగా సంచలనం సృష్టించారు. అయితే బుధవారం ప్రెస్ మీట్ లో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్‌లపై జగన్ మాట్లాడుతూ.. ఏబీవీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖను ఉపయోగించుకుని కక్షపూరితంగా చంద్రబాబు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేయిస్తున్నారని జగన్ మండిపడ్డారు.
తనకు అనుకూలంగా ఉండే ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను ఒక జట్టుగా చేసి.. వారి చేత అన్ని జిల్లాల్లో వైసీపీ నేతల చిట్టాను ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా తెప్పించుకుని పక్కా ప్రణాళికతో చంద్రబాబు అరెస్టుల పర్వం సాగిస్తున్నారని జగన్ విమర్శించారు. ఈ క్రమంలోనే ఏబీ వెంకటేశ్వరరావు, యోగానంద్, ఆర్పీ ఠాకూర్ పేర్లను ఉచ్చరించడంతో పాటు ఏక వచనంతో సంభోదించి జగన్ వారిని అగౌరపరిచారు. దీంతో ఎక్స్ వేదికగా ఏబీవీ జగన్ కు వార్నింగ్ ఇచ్చారు.
`మిస్టర్ జగన్ రెడ్డీ.. నోరు అదుపులో పెట్టుకో.. మాట సరిచేసుకో. భాష సరిచూసుకో! ఒక సారి ప్రజల విశ్వాసం కోల్పోయినా.. ఒక సారి నోరు జారినా.. తిరిగి వాటిని ఎన్నటికీ పొందలేరు. నీలా కుసంస్కారంతో నేను మాట్లాడను. తెరవెనుక భాగోతాలు నడపను. నేనేంటో.. తలవంచని నా నైజం ఏంటో గడిచిన 5 ఏళ్లలో నువ్వే చూశావ్. బీ కేర్‌ఫుల్! ఫర్ ద రికార్డ్.. నిన్న నువ్వు నా గురించి చెప్పింది పచ్చి అబద్ధం` అంటూ ఏబీ వెంకటేశ్వరరావు ట్వీట్స్ చేశారు.