వైఎస్ జగన్మోహన్ రెడ్డి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ కు ఢిల్లీ నుంచి రియాక్షన్ మొదలైంది. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ అత్యంత సత్ప్రవర్తన కలిగిన జస్టిస్ రమణపై జగన్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ, జగన్ చేసినది న్యాయవ్యవస్థపై దాడి అని ఖరాఖండిగా చెప్పింది. ఇది ఏమాత్రం క్షమార్హం కాదని జగన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీ కూడా జగన్ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ స్వార్థం కోసం న్యాయవ్యవస్థపై దాడి చేయడం ద్వారా లబ్ధి పొంది ప్రజలకు రాజ్యాంగం పరంగా దక్కిన అండను నాశనం చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆరోపించింది.
నిన్న ఒక న్యాయవాది జగన్ లేఖను కోర్టు దిక్కారంగా చెబుతూ కేసు నమోదు చేయాలని పిటిషను వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్…జగన్ ను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి, ఈ కుట్రపై విచారణ చేయాలని కోరుతూ పిటిషను వేశారు.
ఈ పిటిషనులో వారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వారు ఏమన్నారంటే… 30కి పైగా అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులున్న జగన్ రెడ్డి, న్యాయవ్యవస్థ పరపతిని, గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారంటూ.. హైకోర్టు న్యాయమూర్తులు కొందరిపై.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ సీజేఐ కి రాసిన లేఖ అన్ని నిబంధనలకు విరుద్ధం అన్నారు.
అత్యంత కాన్ఫిడెన్షియల్ అయిన ఆ లేఖను.. ఒక పక్కా కుట్రప్రకారం ప్రభుత్వ ముఖ్య సలహాదారుతో మీడియాకు రిలీజ్ చేయించి.. మీడియా ముఖంగా.. న్యాయమూర్తులపై విమర్శలు చేశారు. దీనిపై జడ్జిల కమిటీ ఏర్పాటుచేసి దర్యాప్తు చేయించాలి, అలాగే వారికి సీబీఐ సహకరించేలా ఆదేశించాలి. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ప్రమాదకరమైన పరిణామం. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థపై ఆధిపత్యానికి చేస్తున్న ప్రయత్నం అని పేర్కొన్నారు.