కోనసీమ జిల్లాలో వలసల పర్వం మరోసారి ఊపందుకుంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనే మాటను నాయకులు నిజం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే రాపాక రాజకీయా భవిష్యత్తుపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడినా.. ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. రాపాక పై పవన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్టీ తరఫున అసెంబ్లీలో తన వాయిస్ వినిపిస్తాడని భావించారు.
కానీ పవన్ ఆశలపై నీళ్లు జల్లుతూ రాపాక అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీకి దగ్గరయ్యారు.ఎంతగానో ఆదరించి, టికెట్ ఇచ్చి, గెలిపించుకుంటే సొంతపార్టీకి హ్యండిచ్చి.. వైసీపీ పంచకు చేరిపోవడంతో రాపాకపై అధ్యక్షడు పవన్ కళ్యాణ్ తో పాటు జనసైనికులు అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 2024 ఎన్నికల్లో మళ్లీ రాజోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రాపాక భావించినప్పటికీ.. వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించలేదు. జగన్ సూచన మేరకు అయిష్టంగానే అమలాపురం ఎంపీగా పోటీ చేసిన రాపాక.. కూటమి ధాటికి ఓటమి పాలయ్యారు.
అప్పటి నుంచి వైసీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న రాపాక.. ఈ మధ్య జనసేన మీటింగ్‌ల్లో వరుసగా ప్రత్యక్షమవుతున్నారు. పైగా రెండు రోజుల క్రితం రాపాక వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. దాంతో ఆయన కూటమిలో చేరడం ఖాయమైంది. అయితే రాపాక ఏ పార్టీలో చేరతారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జనసేనలోకి తిరిగి వెళ్దామంటే.. సొంత గూటి నుంచి ఆయనకు గట్టి సెగ తగులుతోంది. రాపాక పార్టీకి తీరని ద్రోహం చేశారని.. ఆయన్ను తిరిగి తీసుకునే అవకాశం లేదని రాజోలు జనసేన నేతలు బలంగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా రాపాక విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు.
అయితే రాపాక టీడీపీలో చేరతారని ఇటీవల వార్తలు వస్తున్నప్పటికీ.. పవన్ కల్యాణ్ సుముఖం లేకుండా ఆ పార్టీ తీసుకునే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పోని బీజేపీలోకి జంప్ అవుతారనుకుంటే.. రాపాకే అందుకు ఆసక్తి చూపడం లేదనే గుసగుసలు గుప్పుమంటున్నాయి. దీంతో రాపాక రూటెటు అనే చర్చ కోనసీమ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.